నిసాన్ ఇండియా తన కొత్త కారు మ్యాగ్నైట్ బుకింగ్ నంబర్లను ప్రకటించారు. 2021లో ఏకంగా నిసాన్ మ్యాగ్నైట్‌కు 78,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. నిసాన్ మ్యాగ్నైట్ మనదేశంలో 2020 డిసెంబర్‌లో లాంచ్ అయింది. అంటే నెలకు దాదాపు 6,500 కార్లు బుక్ అయ్యాయన్న మాట. ఇది నిజంగా చాలా పెద్ద నంబర్.


ఈ కారు ధర మనదేశంలో రూ.5.76 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు అందించారు. వీటిలో ఒకటి 1.0 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్ కాగా.. మరొకటి 1.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ మోటార్. వీటిలో మొదటి ఇంజిన్ 71 బీహెచ్‌పీ, 96 ఎన్ఎం పీక్ టార్క్ అందించనుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఇందులో ఉండనుంది.


ఇక టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ వేరియంట్ 99 బీహెచ్‌పీ, 152 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఈ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ వేరియంట్‌లో సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనుంది. ఈ ఫోన్ ఎక్స్‌పోర్ట్ నంబర్లను కూడా కంపెనీ అందించింది. 2021 డిసెంబర్ వరకు మ్యాగ్నైట్‌కు సంబంధించిన 6,344 యూనిట్లను వేరే దేశాలకు ఎగుమతి చేసింది.


ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనే, ఉగాండా, కెన్యా, సేచెల్స్, మొజాంబిక్, జాంబియా, మారిషస్, టాంజానియా, మలావి దేశాలకు ఈ కారు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ మ్యాగ్నైట్ ఎస్‌యూవీకి ఇతర దేశాల్లో కూడా ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.