MS Dhoni Treatment: మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు షాక్! మైదానంలో చిరుతలా పరుగెత్తే ఈ ఛాంపియన్ ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు. రాంఛీలోని ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం అతడు గాయాల నుంచి కోలుకుంటున్నాడని సమాచారం.
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు స్థానిక ఆయుర్వేద నిపుణుడైన వందన్ సింగ్‌ను కలిశాడు. ఇప్పటికీ చికిత్స కొనసాగిస్తున్నాడు. కొన్ని మూలికలు వేసుకొని పాలు తాగాలని వైద్యుడు ఆయనకు సూచించారు. నెల రోజుల క్రితమే ధోనీ ఒక డోసు ఔషధం తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాతి డోసుకు ఎప్పుడొస్తాడో తెలియదన్నారు.
మొదట ధోనీ గురించి తనకు అంతగా తెలియదని వందన్ సింగ్ అన్నారు. జనాలు వచ్చి ఫొటోలు తీసుకొనేందుకు ఎగబడటంతో అతడి గురించి తెలిసిందన్నారు. రెండు మూడు నెలలుగా ధోనీ తల్లిదండ్రులు సైతం ఆయన వద్దకే చికిత్స కోసం వస్తున్నారని టైమ్స్ నౌ రిపోర్టు చేసింది. ఆ తర్వాత మోకాళ్లలో అసౌకర్యంగా అనిపించడంతో ధోనీ సైతం ఆయన వద్దకే వచ్చాడు. రూ.40 విలువైన ఔషధం తీసుకున్నాడు.
Also Read: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!
Also Read: ఆడకూడని బంతులకు ఓపెనర్లు ఔట్ - లంచ్‌కు టీమ్‌ఇండియా 53-2
ఇదే సీజన్ చివరిది అనుకుంటున్న అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ ఐపీఎల్ 2022 ముగియగానే గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడని కన్ఫామ్ చేసింది. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.
గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్ లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందన్నాడు.