నెల్లూరు(Nellore) జిల్లా ముత్తుకూరు మండలంలో పామాయిల్ శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. పోర్ట్ ద్వారా విదేశాలనుంచి వచ్చే ముడి ఆయిల్  ఇక్కడ ఉండే రిఫైనరీలలో శుద్ధి చేస్తారు. అక్కడి నుంచి వాటిని ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే ఇలా శుద్ధి చేసే క్రమంలో ఆయా రిఫైనరీల నుంచి వ్యర్థాలు వెలువడుతుంటాయి. ఆయా వ్యర్థాలను అక్కడికక్కడే విషరహితంగా మార్చి వాటిని కాల్వల్లోకి వదలాల్సి ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కంపెనీలు పెద్దగా వాటిపై దృష్టి పెట్టవు. వ్యర్థాలన్నిటినీ అలాగే పంట కాల్వల్లోకి వదిలిపెడుతుంటారనే ఆరోపణలున్నాయి. దీంతో సహజంగానే ఆయా ప్రాంతాల్లో విషవాయువుల వల్ల మనుషులు, పశువులు తరచూ అనారోగ్యాలకు గురవుతుంటారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా జరిగిన విషవాయువు లీకేజీ ఘటనలో 8 మంది కార్మికులు అదృష్టవ శాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లేకపోతే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు. 


ముత్తుకూరు మండలం పంటపాలెంలోని ఇమామి అగ్రి టెక్ లిమిటెడ్ పామాయిల్ రిఫైనరీలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకేజీ  కారణంగా 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలోని డ్రైనేజీ క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు అస్వస్థత గురయ్యారు. వారంతా ప్రమాదాన్ని గ్రహించి వెంటనే ఓపెన్ ఏరియాలోకి పరిగెత్తుకెళ్లారు. తిరిగి సాధారణ గాలి పీల్చడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే స్పృహతప్పిన వారిని వెంటనే యాజమాన్యం నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించింది. 




ఆస్పత్రికి వచ్చే సరికి నలుగురికి సీరియస్ గా ఉంది, మరో నలుగురి పరిస్థితి కాస్త కుదుటపడింది. వెంటనే అందరికీ చికిత్స మొదలు పెట్టారు. ఒక వ్యక్తిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతను కూడా కోలుకున్నాడు. స్వల్ప అస్వస్థతకు గురైన నలుగురిని డిశ్చార్జి చేశారు. మిగతా వారిపై విష వాయువు ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేసి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తామంటున్నారు వైద్యులు. హుటాహుటిన నెల్లూరు ఆర్డీవో కొండయ్య ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. 


నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో 8 రిఫైనరీలు ఉన్నాయి. వీటిలో పామాయిల్ ని శుద్ధి చేస్తుంటారు. ఈ శుద్ధి చేసే క్రమంలో కార్మికులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోరని అంటున్నారు. అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఫ్యాక్టరీలో జరిగే దారుణాలు బయటకు రావని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఇకపై అయినా అధికారులు ఇలాంటి రిఫైనరీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు.