Mumbai Indians Women vs Royal Challengers Bangalore Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైటింగ్ స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బ్యాటర్లలో రిచా ఘోష్ (28: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ మూడు వికెట్లు దక్కించుకుంది. ముంబై విజయం సాధించాలంటే 120 బంతుల్లో 156 పరుగులు సాధించాలి.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23: 17 బంతుల్లో, ఐదు ఫోర్లు), సోఫీ డివైన్ (16: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. అయితే అక్కడ బెంగళూరు టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డు మీద 43 పరుగులు చేరేసరికి నలుగురు బెంగళూరు బ్యాటర్లు పెవిలియన్ చేరుకున్నారు.


ఆ తర్వాత మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు బెంగళూరును ఆదుకున్నారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు అందరూ కనీసం 20 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రిచా ఘోష్ (28: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), కనికా అహూజా (22: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), శ్రేయాంక పాటిల్ (23: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు), మేగాన్ షుట్ (20: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) బ్యాట్‌తో విలువైన పరుగులు జోడించారు.


బెంగళూరు బౌలర్లలో హీలీ మాథ్యూస్ మూడు వికెట్లు తీసింది. అమీలియా కెర్, సైకా ఇషాక్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. నాట్ స్కీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీసుకున్నారు.


ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు (ప్లేయింగ్ XI)
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్