Sharwa 35: విభిన్న కథలతో కూడిన చిత్రాలను ఎంచుకోవడంలో హీరో శర్వానంద్ (Sharwanand) ఎప్పుడూ ముందుంటారు. శర్వా సినిమా వస్తుందంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ మంచి సక్సెస్ అయింది. దాదాపు ఆరు నెలల టైమ్ తీసుకున్నాక శర్వానంద్ ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించారు.
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీసే శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ తన తర్వాతి సినిమా తీయనున్నారు. ఈ విషయాన్ని ఒక అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’, ‘హీరో’ ఇలా శ్రీరామ్ ఆదిత్య తీసినవన్నీ క్రైమ్ థ్రిల్లర్లే.
ప్రస్తుతం శర్వానంద్‌తో తీస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ‘Sharwa35’ అని హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఈ సినిమాని ప్రకటించారు. అంటే ఇది శర్వాకు 35వ సినిమా అన్నమాట. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో క్రైమ్ ఛాయలేవీ కనిపించలేదు.
కానీ పోస్టర్‌లో ఉన్న కో-ఆర్డినేట్స్ మాత్రం లండన్‌ను సూచిస్తాయి. కాబట్టి లండన్ నేపథ్యంలో జరిగే అల్ట్రా స్టైలిష్ స్టోరీ అనుకోవచ్చు. సినిమా జోనర్ గురించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందని, ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయిందని వార్తలు వస్తున్నాయి.,
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా ఉన్నారు. గతేడాది మలయాళ ‘హృదయం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ అందించిన హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ, ఎడిటర్: ప్రవీణ్ పూడి
శర్వానంద్ నిశ్చితార్థం కూడా ఈ సంవత్సరం జనవరిలోనే జరిగింది. సింపుల్ గా ఈ వేడుకును కానిచ్చేశారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వధువు రక్షిత రెడ్డి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. రక్షితరెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలిసింది. అంతేకాదు, ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. ఇంతకీ శర్వానంద్ ఆ అమ్మాయిని ఎక్కడ కలిశాడు? వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనే విషయం మాత్రం బయటకు తెలియదు.