Boycott Laal Singh Chaddha: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చడ్డా సినిమాను నిషేధించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ డిమాండ్ చేశాడు. అలా చేయకపోతే భారత సైన్యం, సిక్కులను అగౌరవ పర్చినట్టు, అవమానించినట్టే అవుతుందని స్పష్టం చేశాడు. సినిమాలో ఇండియన్ ఆర్మీ, సిక్కు మతాన్ని చెడుగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
'ఫారెస్ట్ గంప్' అనే ఆంగ్ల చిత్రాన్ని మూలంగా తీసుకొని 'లాల్ సింగ్ చడ్డా' సినిమాను ఆమిర్ ఖాన్, అతడి మాజీ సతీమణి నిర్మించిన సంగతి తెలిసిందే. వాస్తవంగా వియత్నాం యుద్ధం కోసం అమెరికన్లు తక్కువ ఐక్యూ ఉన్న వాళ్లని సైన్యంలోకి తీసుకున్నారని పనేసర్ అంటున్నాడు. భారత సైన్యానికి అలాంటి అవసరం లేదని వెల్లడించాడు. అందుకే ఇది సిక్కు మతం, భారత సైనిక దళాలను అగౌరవపర్చినట్టు అవుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
'లాల్ సింగ్ చడ్డాలో ఆమిర్ ఖాన్ ఓ తెలివి తక్కువ వాడిగా నటించాడు. ఫారెస్ట్ గంప్ సైతం తెలివి తక్కువ సినిమా!! ఇది అగౌరపరచడం, అవమానించడమే. లాల్‌సింగ్ చడ్డా సినిమాను నిషేధించండి' అని మాంటీ ట్వీట్ చేశాడు. 'ఫారెస్ట్ గంప్ అనేదీ అమెరికా ఆర్మీకి సరిపోతుంది. వియత్నాం యుద్ధ అవసరాల కోసం అమెరికా సైన్యం తక్కువ ఐక్యూ ఉన్నవారిని చేర్చుకుంది. ఈ సినిమా మొత్తం సిక్కులు, భారత సైన్యాన్ని అవమానించింది. అగౌరవపరిచింది' అని మరో ట్వీట్ వదిలాడు. భారత సైన్యంలో సిక్కులు ఎలాంటి గౌరవం, పురస్కారాలు పొందారో మాంటీ వివరించాడు.
లాల్‌సింగ్ చడ్డా కథ (Laal Singh Chaddha Story) : లాల్ సింగ్ చడ్డా (ఆమిర్ ఖాన్) సగటు చిన్నారి కాదు, మొద్దు మొహం! విషయం అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. అయితే 'నువ్వు అందరి లాంటి చిన్నారివే. ఎందులోనూ తక్కువ కాదు. నీ పనులు నువ్వు చేసుకోవాలి' అని అతడికి తల్లి (మోనా సింగ్) ధైర్యం చెబుతుంది. అటువంటి లాల్ సింగ్ చడ్డాకు స్కూల్‌లో రూపా డిసౌజా (కరీనా కపూర్ ఖాన్) పరిచయం అవుతుంది. లాల్ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? ఆర్మీలో తనకు పరిచయమైన బాలరాజు (అక్కినేని నాగ చైతన్య) కోసం లాల్ ఏం చేశాడు? కార్గిల్ యుద్ధంలో లాల్ కాపాడిన మహ్మద్ భాయ్ (మానవ్ విజ్) ఎవరు? చారిత్రాత్మక సంఘటనలతో ముడి పడిన లాల్ జీవితం ఎలా ఉంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
'లాల్ సింగ్ చడ్డా' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆమిర్ ఖాన్ చెబుతూ వచ్చారు. సినిమా కోసం ఆయన 14 ఏళ్ళు తపించారు. బహుశా... లాల్ పాత్రను ఆయన అమితంగా ప్రేమించడంతో ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. ఆమిర్ నటన గానీ, సినిమా గానీ కొత్తదనం ఇవ్వలేదు. అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులను నిరాశ పరిచే చిత్రమిది. అక్కినేని నాగ చైతన్య సమ్‌థింగ్ స్పెషల్ అనిపించే పాత్రతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సింది అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.