CM Jagan Review : ఏపీలో స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియిమిస్తున్నట్లు సీఎం జ‌గ‌న్ ప్రక‌టించారు. పాఠ‌శాల‌ల్లో ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగుచేసేలా నిర్దిష్టమ‌యిన‌ విధానం అమ‌లులోకి తేవాల‌ని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ తో పాటు, వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరినాటికే సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. దశలవారీగా డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటు  చేయాలని సీఎం జగన్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. 


అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ 


సీఎం జగన్‌ మాట్లాడుతూ... నాడు-నేడు కింద పనులు పూర్తయిన స్కూళ్లలో నిర్వహణబాగుండాలన్నారు. దీనికోసం ఎస్‌ఓపీలను రూపొందించాలని సూచించారు.  ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్నారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా ఓ విధానం ఉండాలన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.  రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలన్న సీఎం, అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుందన్నారు. స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. వీటిపై దృష్టిపెట్టాలని సూచించారు.


జగనన్న విద్యా కానుకపై సీఎం సమీక్ష 


వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్‌ నాణ్యతను సీఎం పరిశీలించారు.


ట్యాబ్‌ల పంపిణీపై 


8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. అందుకు టెండర్లు ఖరారు చేసి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఏర్పాటుపైనా సీఎం సమీక్షించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధనపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో పాఠ్యాంశాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. దీని వల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆ మేరకు వాటిని అందించాలన్నారు. ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత ఉండకూడదన్నారు. 


బాలికల భద్రతపై అవగాహన


రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా విద్యార్థినులను కలిసి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ ‌కోసం నియమించాలన్నారు.  


Also Read : TDP YCP In BJP Trap : వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !


Also Read : YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం - సుప్రీంకోర్టులో వైఎస్ సునీత పిటిషన్!