Tom Latham Statement After 2nd ODI Raipur: భారత్-న్యూజిలాండ్ మధ్య రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులభంగా గెలిచింది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ పిచ్ గురించి పెద్ద కామెంట్ చేశాడు. అదే సమయంలో అతను మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీల బౌలింగ్‌ను కూడా ప్రశంసించాడు.


మ్యాచ్ అనంతరం టామ్ లాథమ్ మాట్లాడుతూ, "మా బ్యాటింగ్ బాగా లేదు. భారత్ సరైన ఎండ్‌లో ఎక్కువ సేపు బౌలింగ్ చేసింది. ఆరోజు ఏదీ మాకు అనుకూలంగా జరగలేదు. పిచ్‌లో టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది. బౌలర్లకు ఇది సహకరిస్తుంది. దురదృష్టవశాత్తు మేము ప్రారంభంలో భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాము." అన్నారు.


న్యూజిలాండ్ కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ, "మీరు తక్కువ స్కోరులో ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు, పరుగులు చేయడం అంత సులభం కాదు. ప్రతి మ్యాచ్‌లో మీరు బాగా రాణించాలనుకుంటున్నారు. గత మ్యాచ్‌లో పిచ్, ఈ మ్యాచ్‌లో పిచ్ మధ్య చాలా తేడా ఉంది. రాయ్‌పూర్‌లో జరగనున్న తదుపరి మ్యాచ్ కోసం మేం ఎదురుచూస్తున్నాము. అక్కడ బాగా ఆడాలనుకుంటున్నాం." అని పేర్కొన్నాడు.


భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 11 ఓవర్లలో 15/5కి పరిమితం చేశారు. షమీ ఆరు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. లాథమ్ మాట్లాడుతూ, "వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. లైన్ లెంగ్త్ కూడా కచ్చితంగా ఉంది. వారు మాకు సులభమైన స్కోరింగ్ ఆప్షన్లు ఇవ్వలేదు. 11వ ఓవర్‌కే సగం జట్టును కోల్పోయిన తర్వాత మ్యాచ్‌లోకి తిరిగి రావడం చాలా కష్టమైంది." అని తెలిపాడు


వరుస ఓటములతో న్యూజిలాండ్ నంబర్ వన్ ర్యాంక్ కూడా కోల్పోయింది. ఇంగ్లండ్ ఇప్పుడు నంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఇండోర్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిసి సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది.


ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. మొదట బౌలర్లు  108 పరుగులకే కివీస్ ను ఆలౌట్ చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.


108 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ (51) స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ కు తోడైన కోహ్లీ (11) రెండు చూడచక్కని బౌండరీలు కొట్టాడు. అయితే ఆ తర్వాత స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. మరోవైపు గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ (53 బంతుల్లో 40).. ఇషాన్ కిషన్ (8) తో కలిసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.