Annamayya District : ఇవాళ ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో ఓ బాలింత పరీక్ష రాసేందుకు రాగా, ఆ చిన్నారిని మహిళా కానిస్టేబుల్ లాలించిన వైనం చూపరులను కట్టిపడేసింది.  అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య కాలేజీలో ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. ఈ క్రమంలో ఓ తల్లి పరీక్ష రాసేందుకు 4 నెలల చిన్నారితో కాలేజీకి చేరింది. ఆమె తన తల్లికి, భర్తకు బిడ్డను బయట అప్పగించి పరీక్ష రాసేటందుకు పరీక్ష కేంద్రానికి వెళ్లింది. పరీక్ష మొదలైన అరగంట నుంచి చిన్నారి ఏడ్వడం మొదలుపెట్టాడు. చిన్నారి తండ్రి ఎంత లాలించిన బాబు ఏడుపు ఆపలేదు. అక్కడ విధినిర్వహణలో ఉన్న బాలింత అయిన మన్నూరు పోలీస్ స్టేషన్ ఉమెన్ కానిస్టేబుల్ అమరావతి, పిల్లాడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని పాలిచ్చి లాలించడంతో చిన్నారి నిద్రలోకి జారుకున్నాడు.  ఇదంతా గమినిస్తున్న విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది కానిస్టేబుల్ అమరావతి సేవలను కొనియాడారు. 


కడప జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు 


కడప జిల్లాలో కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ప్రొద్దుటూరు, కడప పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 71 కేంద్రాల్లో  36,534 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. కడపలో 48, ప్రొద్దుటూరు లో 23 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి 1 వరకు ఎగ్జామ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలను ఎస్పీ కె.కె అన్బురాజన్ సందర్శించారు. అక్కడ పరీక్షల తీరును చెక్ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్న అభ్యర్థుల హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులను ఎస్పీ స్వయంగా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులోని మొత్తం 71 కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయని, పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి సెంటర్ లో ఒక ఎస్ఐ, 10 మంది సిబ్బందితో పకడ్బందీగా భద్రతా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులోని పరీక్ష కేంద్రాల్లో 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.  ప్రతి రెండు సెంటర్లకు సీఐ స్థాయిలో, ప్రతి నాలుగు సెంటర్లకు డి.ఎస్.పి స్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.అభ్యర్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో  మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు.  


6100 పోస్టుల భర్తీకి పరీక్ష 


ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషులు 1,40,453 మంది ఉండగా..మహిళలు 32,594 మంది ఉన్నారు. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.