Karnataka CM Siddaramaiah announces Rs 50 lakh cash prize for Rohan Bopanna: ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్( Mens doubles Australian Open title Winner) గెలిచి చరిత్ర సృష్టించిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న(Rohan Bopanna)ను కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి భారత ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేశాడంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) కొనియాడారు. రోహన్ బోపన్నకు రూ.50 లక్షల బహుమతి అందివ్వనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. బొప్పన్నను తన కుటుంబసభ్యుల మధ్యే సత్కరించారు. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, మంత్రి శివరాజ్ తంగదై బొప్పన్నను సత్కరించిన వారిలో ఉన్నారు. మెన్స్ డబుల్స్ కేటగిరీలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఇండియన్‌గా బొప్పన్న నిలిచాడు. గతంలో భారత టెన్నిస్ ఆటగాళ్లలో లియాండర్ పేస్, మహేహ్ భూపతి మాత్రమే మెన్స్ డబుల్స్‌లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు.
చరిత్ర సృష్టించిన బోపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండస్లామ్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు.
మొత్తం గంటా 39 నిముషాలు జరిగిన తుదిపోరులో ఇటలీ జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. కానీ తమ అనుభవంతో బోపన్న, ఎబ్డెన్ జోడీ విజయాన్ని అందుకుంది. ఒకదశలో 3-4 తేడాతో రెండో సెట్‌లో వెనకబడినా.. బోపన్న జోడీ తర్వాత పుంజుకుని సెట్ నెగ్గింది. దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ఆటగాడిగా బోపన్న నిలిచాడు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నను పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం తెలిసిందే. 2017లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు రోహన్ బోపన్న. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో మెన్స్ డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించాడు. అయితే 60 ప్రయత్నాలలో విఫలమైన బోపన్న.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 61వ ప్రయత్నంలో అది కూడా 43 ఏళ్ల లేటు వయసులో మెన్స్ డబుల్స్ టైటిల్ సాధించాడు. మహిళల విభాగంలో సానియా మిర్జా డబుల్స్ టైటిల్స్ నెగ్గారు.
నెంబర్ వన్‌గానూ....
43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలవడంపై భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తొలిసారి స్పందించాడు. తన కెరీర్‌లో నమ్మశక్యం కానీ రెండు దశాబ్దాలు గడిచిపోయాయని రోహన్ బోపన్న అన్నాడు. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఈ ఘనత సాధించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఈ టెన్నిస్ స్టార్ అన్నాడు. తన కుటుంబానికి, కోచ్, ఫిజియోకు, భారత టెన్నిస్ సమాఖ్యకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి బోపన్న ధన్యవాదులు తెలిపాడు.