Medico Forceful Death With Poison Injection in Hyderabad ORR: హైదరాబాద్ (Hyderabad)లోని ఓఆర్ఆర్ (ORR)పై కారులో ఓ మెడికో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనారెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లోని హెచ్ఐజీలో ఉంటున్నారు. కాగా, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై కారులో ఆమె అపస్మారక స్థితిలో ఉండడాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రచనారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అదే కారణమా..


అయితే, నిశ్చితార్థం జరిగిన యువకుడితో మనస్పర్థల కారణంగానే మెడికో రచనారెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె సోదరుడు చెప్పిన వివరాలు ఆధారంగా ఓ నిర్ధారణకు వచ్చారు. 'రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఇటీవలే ఆమెకు ఓ యువకునితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే, నిశ్చితార్థం జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కారణాలు ఫోరెన్సిక్ నివేదికలో తేలుతాయి.' అని అమీన్ పూర్ సీఐ తెలిపారు.


అటు, తన చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉందని.. చాలాసార్లు నచ్చచెప్పామని ఆమె సోదరుడు తెలిపారు. తమ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం, పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలోనే రచనారెడ్డి మృతదేహం ఉంది. అలాగే, ఆమె మృతిపై ఇప్పటి వరకూ కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.


సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య


మరోవైపు, హైదరాబాద్ కేపీహెచ్ బీ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భువన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వసతిగృహంలో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది. మృతుడు టీసీఎస్ లో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Also Read: Govt School Fee: సర్కార్ బడిలో ఫీజు అడిగిన హెచ్ఎం, జగిత్యాల కలెక్టర్ కు తల్లిదండ్రుల ఫిర్యాదు