Govt School Fee: విద్యతోనే వివేకం వస్తుంది. అలాంటి విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే  ప్రభుత్వం వేలకోట్లు వెచ్చించి ఉచిత నిర్బంధ విద్య అందిస్తోంది. సర్కార్ బడుల్లో చదువుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా పుస్తకాలు, డ్రెస్సులతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తుంటేనే  ప్రభుత్వ బడుల్లో చేరడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అంతంత మాత్రం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనూ  ఫీజులు కట్టాల్సిందేనని హుకుం జారీచేస్తే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి..? తెలంగాణ(Telangana)లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం నివ్వెరపరుస్తోంది.


సర్కార్ బడికి ఫీజు
ప్రభుత్వ పాఠశాలలో ఫీజు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు...ప్రజావాణి(Prja Vani) కార్యక్రమంలో ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్టకపోతే స్కూలుకు రావొద్దని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అధికారులపై జగిత్యాల(Jagityala)  కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కట్కాపూర్‌కు చెందిన ఎండీ ఆస్మా-ఎండీ చాంద్‌పాషా దంపతులకు ఇద్దరు పిల్లలు. వారు కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక పెద్ద కూతురు ఎండీ లాస్యను గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదివిస్తున్నారు. అయితే ఆ పాఠశాలకు నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు  ఉన్నా....మరో ముగ్గురు విద్యావాలంటీర్లను నియమించుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులే  పాఠాలు బోధించాల్సి ఉన్నా....వాలంటీర్లతో తరగతులు చెప్పిస్తున్నారు. విద్యావాలంటీర్లకు జీతాలు చెల్లించేందుకు  ఒక్కో విద్యార్థి నెలకు రూ.700 రూపాయలు కట్టాలంటూ  తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.  పాఠశాల ఫీజు కట్టలేదని తన కుమార్తెకు హాల్ టిక్కెట్ ఇవ్వకుండా ప్రధానోపాధ్యాయుడు  ఎండలో నిలబెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వాళ్లం తాము నెలకు రూ.700 ఎక్కడ నుంచి తెచ్చి కట్టగలమని వారు కలెక్టర్ కు విన్నవించుకున్నారు. స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూలు కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై  చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఉచితంగా విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ మళ్లీ విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యావాలంటీర్లను ఎలా నియమించుకున్నారని నిలదీస్తున్నారు. సర్కారీ చదువులపై నమ్మకం లేక పాఠశాలల్లో చేరేందుకు చాలామంది సుముఖంగా లేరని...వచ్చిన వారిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు.
అబ్బే అలాంటిదేమీ లేదు
కట్కాపూర్‌ ఎంపీపీఎస్‌(MPPS)లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.  ప్రజావాణిలో ఫిర్యాదు అందిన వెంటనే తాము స్కూలుకు వెళ్లి విచారణ జరిపామని.... పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులను విచారించామన్నారు. ఎవరూ ఫీజులు వసూలు చేస్తున్నట్లు చెప్పలేదని జగిత్యాల డీఈవో(DEO) జగన్మోహన్ రెడ్డి తెలిపారు.