ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ (Joe Root) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇప్పటికిప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. దాదాపు ఐదేళ్ల పాటు ఆంగ్లేయ జట్టుకు అతడు నాయకుడిగా పనిచేశాడు. 64 మ్యాచులకు సారథ్యం వహించి 27 విజయాలు, 26 ఓటములు చవిచూశాడు. అయితే చివరి 17 మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ (England Cricket) ఒకే టెస్టు గెలవడంతో రూట్‌పై ఒత్తిడి పెరిగింది. బాధ్యతల నుంచి తప్పుకొనేలా చేసింది.


ఈ మధ్యే ఇంగ్లాండ్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. 0-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆటగాళ్లెవరూ రాణించికపోయినా జట్టును రూట్‌ వెనకేసుకొచ్చాడు. 'ఈ సమయంలో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా. జట్టులో ఎన్నో మెరుగయ్యాయి. కుర్రాళ్లు గొప్పగా క్రికెట్‌ ఆడారు' అని చెప్పాడు. అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రం అతడి అభిప్రాయంతో ఏకీభవించలేదు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. పదేపదే సానుకూలంగా మాట్లాడుతుండటం అతడిలో ఆత్మవిశ్వాసం లోపాన్ని ప్రతిబింబిస్తోందని మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ అన్నాడు. విండీస్‌ టూర్‌ నుంచి ఇంటికి రాగానే రూట్‌ తన అభిప్రాయం మార్చుకొని రాజీనామా చేశాడు.


Also Read: ఇంత భక్తేంటి సామీ! వద్దంటున్నా సచిన్‌ కాళ్లకు దండం పెట్టిన జాంటీరోడ్స్‌!


'కరీబియన్‌ పర్యటన నుంచి ఇంటికొచ్చాక ఆలోచించుకోవడానికి కాస్త సమయం దొరికింది. నేను ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు సారథ్యం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్లో నేను తీసుకున్న కఠిన నిర్ణయం ఇదే. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత కెప్టెన్సీ నుంచి దిగిపోయేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. నా దేశాన్ని నడిపించినందుకు సంతోషంగా ఉంది. గడిచిన ఐదేళ్లు నాకెంతో గర్వకారణం. కెప్టెన్సీ చేయడం గొప్ప గౌరవం' అని రూట్‌ అన్నాడు.


'నా దేశాన్ని నడిపించడాన్ని నేనెంతో ప్రేమించాను. కానీ అది నాపై ఎంత ఒత్తిడి పెంచిందే ఇప్పుడే అర్థమైంది. ఈ ప్రభావమే నన్ను ఆటకు దూరం చేసింది. కెప్టెన్సీ నుంచి దిగిపోయినా ఆటగాడిగా కొనసాగుతాను. నేనిలాగే జట్టుకు విజయాలు అందిస్తాను. తర్వాతి కెప్టెన్‌, సహచరులు, కోచులకు సాయం చేస్తాను' అని రూట్‌ తెలిపాడు. ప్రస్తుతం బెన్‌స్టోక్స్‌ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. రోరీ బర్న్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోస్‌ బట్లర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.