హైకోర్టు విభజన జరిగాక తెలంగాణ హైకోర్టుకు ధర్మాసనాల సంఖ్యను పెంచినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు (CJI NV Ramana) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో న్యాయాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.


హైదరాబాద్‌ పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉందని, సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసని అన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్‌లో వారు పెట్టారని గుర్తు చేశారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచామని అన్నారు.


తెలంగాణ హైకోర్టులో బెంచ్‌‌లు పెంచినందున అందుకు తగ్గట్లుగా కోర్టు సిబ్బందిని కూడా పెంచుతామని కేసీఆర్ చెప్పారు. హైకోర్టులో 780 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేస్తామని అన్నారు. అందుకు జీవో కూడా అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా కోర్టులకు అదనంగా 1,730 పోస్టులు మంజూరు చేశామని సీఎం చెప్పారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందని, నియామక ప్రక్రియ చేపట్టి సమస్య పరిష్కరించేలా చూడాలని జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని కేసీఆర్ అన్నారు.


రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్‌ చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తుల హోదాకు తగ్గట్లుగా 30 ఎకరాల్లో క్వార్టర్స్‌ నిర్మిస్తామని, దుర్గం చెరువు ప్రాంతంలో ఆ స్థలాన్ని గుర్తించామని చెప్పారు. ఒక్కసారి ఆ స్థలం ఫైనల్ అయ్యాక శంకుస్థాపన చేయిస్తామని, అందుకు రావాలని సీజేఐను సీఎం అభ్యర్థించారు.


సీఎంను ప్రశంసించిన సీజేఐ
సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్ లాంటి వారు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థ అగ్ర పథాన ఉండాలని ఆయన పడుతున్న తపనకు, ఆయన వరాలజల్లుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో దాదాపు 4,320 ఉద్యోగాల్ని కేసీఆర్ (KCR) క్రియేట్ చేశారని గుర్తు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిస్తున్న క్రమంలో ఇక్కడ మాత్రం పెంచడం ప్రశంసనీయమని కొనియాడారు.