Dhanashree Verma's wish on Yuzvendra Chahal's 150th IPL match: గుజరాత్‌(GT)తో జరిగిన మ్యాచ్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌.. ఐపీఎల్‌లో 150వ మ్యాచ్‌ మైలురాయిని చేరుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 2013 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గాను కొనసాగుతున్నాడు.  జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్‌ 150వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. చాహల్‌ ఈ అరుదైన ఘనతను సాధించడంపై అతడి భార్య ధనశ్రీ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్‌ స్టా గ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా పోస్ట్ చేసింది. ఐపీఎల్ కెరీర్‌లో 150వ మ్యాచ్ ఆడిన తన భర్త చాహల్‌కు ధన శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. మీ ఘనతల పట్ల అందరం గర్వంగా ఉన్నామని ఆ వీడియోలో పేర్కొన్నారు. పడిపోయిన ప్రతీసారి లేచి మళ్లీ జట్టులోకి వచ్చిన తీరు ఆదర్శ ప్రాయమని ధనశ్రీ తన భర్తపై పొగడ్తలు కురిపించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా జట్టుకు వికెట్లు ఇచ్చే అరుదైన బౌలర్ మీరని కొనియాడారు. 



రాజస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్థాన్‌ జైత్రయాత్రకు గుజరాత్‌ బ్రేక్‌ వేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గుజరాత్‌ చివరి బంతికి విజయం సాధించింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌  రియాన్‌ పరాగ్‌, సంజు శాంసన్‌ రాణించడంతో  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ 48 బంతుల్లో 3 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 76 పరుగులు చేయగా సంజు శాంసన్‌ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ ఒక్కో వికెట్‌ తీశారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌శుభ్‌మన్‌  గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో చివరి బంతికి విజయం సాధించింది. గిల్‌ 44 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి గుజరాత్‌ను విజయం దిశగా నడిపించాడు. గుజరాత్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 37 పరుగులు అవసరంకాగా  రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌ ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా   రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. తెవాటియా 22, రషీద్‌ ఖాన్‌ 24 నాటౌట్‌తో గుజరాత్‌కు విజయాన్ని అందించారు. రషీద్‌ ఖాన్‌ కేవలం 11 బంతుల్లో నాలుగు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. 
 
అదే ప్రధాన కారణం
 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌కు గుజరాత్‌ బ్రేక్‌ వేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరిబంతికి రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓటమికి స్లో ఓవర్‌ రేట్‌ కూడా ఓ కారణమైంది. స్లో ఓవర్‌ రేట్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కొంపముంచింది. రాజస్థాన్‌ నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్‌ ఓటమికి ప్రధాన కారణమైంది.