WPL 2023:
విమెన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధం! మహిళా క్రికెటర్లు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. తొలిసారి ఉపఖండంలో మహిళ టీ20 లీగ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో తొలి మ్యాచులో తలపడేందుకు గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ సై అంటున్నాయి. మరి తుది జట్లు ఎలా ఉండబోతున్నాయ్! కీలక క్రికెటర్లు ఎవరు? గెలిచేదెవరు?
బలంగా ముంబయి
ముంబయి ఇండియన్స్ అత్యంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, పూజా వస్త్రాకర్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలరు. ముంబయిలో హర్మన్‌కు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఆమెకిది అచ్చొచ్చిన నగరం. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ షవర్ బ్రంట్ స్పిన్, పేస్‌ను సునాయసంగా ఆడగలదు. మీడియం పేస్ బౌలింగ్‌తో అదరగొట్టగలదు. బంతిని రెండువైపులా స్వింగ్ చేసే పూజా వస్త్రాకర్ లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. ప్రతి విభాగంలోనూ ముంబయికి ప్రత్యామ్నాయ క్రికెటర్లు ఉన్నారు. అటాకింగ్ వికెట్ కీపర్ లేకపోవడం లోటు. హేలీ మాథ్యూస్, అమెలియా కెర్ కీలకం అవుతారు.
సమతూకంతో గుజరాత్
గుజరాత్ జెయింట్స్ వేలంలో సమతూకమైన జట్టును ఎంపిక చేసింది. స్నేహ్ రాణా బంతిని చక్కగా ఫ్లైట్ చేయగలదు. ముంబయి పిచ్‌లపై ఆమె కీలకం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌లో ప్రాధాన పాత్ర పోషించిన యాష్లే గార్డ్‌నర్ ఇందులోనే ఉంది. బ్యాటు, బౌలింగ్‌తో ఆమె మాయ చేయగలదు. మిడిలార్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. బ్యాటింగ్, బౌలింగులో మంచి ఆప్షన్లు ఉన్నాయి. కెప్టెన్ బెత్‌మూనీ నిలిచిందంటే పరుగుల వరదే. అనబెల్ సుథర్ డియాండ్రా డాటిన్ బంతి, బ్యాటుతో దుమ్మురేపుతారు. హర్లీన్ డియోల్, ఎస్ మేఘనా, డీ హేమలతకు ఎక్కువ అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరం.
తుది జట్లు (అంచనా)
ముంబయి ఇండియన్స్: యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, ధారా గుజ్జర్, నాట్ షివర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమెలియా కౌర్, అమన్‌జ్యోత్ కౌర్, పూజా వస్త్రాకర్, జింతిమని కలితా, ఇస్సీ వాంగ్, సోనమ్ యాదవ్ / సైకా ఇషాకి
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ, సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, యాష్ గార్డ్‌నర్, డీ హేమలత, డియాండ్రా డాటిన్, అనబెల్ సుథర్ ల్యాండ్, స్నేహ్ రాణా, హర్లీ గాలా / అశ్విని కుమారి, మానసి జోషి / మోనికా పటేల్, తనుజా కన్వార్
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
విమెన్ ప్రీమియర్ మ్యాచులు రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ 18 లైవ్ టెలికాస్టింగ్ ఉంది. అభిమానులు ఉచితంగానే మ్యాచులను వీక్షించొచ్చు.