Is 300+ Run Mark In IPL 2025 Possible: ఐపీఎల్ మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి లీగ్ లో కొన్ని మార్పులు చేయ‌డంతో అభిమానులు ఎదురు చూస్తున్న‌ట్లుగా 300 ప‌రుగుల మార్కును చేరుకోవ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తాజాగా జ‌రిగిన కెప్టెన్ల మీటింగ్ లో బీసీసీఐ కొన్ని మార్పులను ప్ర‌తిపాదించ‌గా, ఆమోదం ల‌భించింది. దీనిని బ‌ట్టి, బౌల‌ర్ల‌కు కొంచెం స‌హకారం ల‌భించ‌నుంది. గ‌తంలో స‌లైవా యూస్ చేసి బంతి రివ‌ర్స్ స్వింగ్ చేసేందుకు అస్కారం ఉండేది. కోవిడ్ 19 సంద‌ర్భంగా 2020  నుంచి ఈ విధానంపై నిషేధం విధించారు. దీని వ‌ల్ల బౌల‌ర్ల‌కు మంచి వెసులుబాటు దూర‌మైంది. ఉమ్మితో బంతిని రుద్ది షైన్ చేయ‌డం ద్వారా, ఒక వైపు బంతి బ‌రువు పెంచి దాన్ని రివ‌ర్స్ స్వింగ్ కు అనుకూలంగా చేసి, మంచి ఫ‌లితాల‌ను బౌల‌ర్లు రాబ‌డుతూ ఉండేవారు. అయితే స‌లైవాపై బ్యాన్ విధించ‌డంతో దీనికి చెల్లు చీటి పాడారు. తాజా ఎడిష‌న్ నుంచి ఈ విధానం మ‌ళ్లీ అమల్లోకి రానుంది. ఇది బౌల‌ర్ల‌కి వ‌రంలాంటిది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హైవేలుగా మారిపోతున్న పిచ్ ల‌పై ఈ విధానం బౌల‌ర్ల‌కు ఉప‌క‌రించ‌నుంది. 


300 సాధ్యం కాదా..?
ఈ ఎడిష‌న్ లో మరిన్ని మార్పులు ద్వారా బౌల‌ర్ల‌కు లీగ్ యాజ‌మాన్యం మ‌ద్దతు ప‌లికింది. వైడ్ బాల్ విష‌యంపై డీఆరెస్ కు వెళ్ల‌వ‌చ్చు. కొన్నిసార్లు అంపైర్ల త‌ప్పిదాల వ‌ల్ల లీగ‌ల్ బాల్స్ ను కూడా వైడ్స్ గా ఇచ్చేవారు. హైట్, వికెట్ల‌కు దూరంగా విసిరే బంతుల‌పై చాలెంజ్ చేయ‌వ‌చ్చు. ఇది బ్యాటర్లకూ అనుకూలమే.. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 11 ఓవ‌ర్ మ‌ధ్య నుంచి కొత్త బంతిని అందించ‌డం ద్వారా బౌల‌ర్ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌వ‌చ్చు. డ్యూ కార‌ణంగా బంతి హెవీగా మారితే బ్యాట‌ర్ల‌కు అనుకూలంగా ఉంటుంది. అదే కొత్త బంతిని వాడిన‌ట్ల‌యితే ఈ బెనిఫిట్ తొల‌గించే అవ‌కాశ‌ముంది. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల ఈసారి అంద‌రు అనుకున్న‌ట్లుగా 300 ప‌రుగుల మార్కును చేరుకోవ‌డం సాధ్యం కాద‌ని తెలుస్తోంది. 


కేవ‌లం మూడుసార్లే..
ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగిన వేలాదికిపైగా మ్యాచ్ ల‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే కేవ‌లం మూడుసార్లు మాత్ర‌మే 300 ప‌రుగుల మైలురాయిని దాటారు. అత్య‌ధికంగా 349 ప‌రుగుల‌తో ప్ర‌పంచ రికార్డు న‌మోదైంది. గ‌తేడాది స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ బ్యాటర్లు ఈ మార్కు కు చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. 266-287 మ‌ధ్య నాలుగుసార్లు స్కోర్లు న‌మోదైతే, అందులో మూడుసార్లు ఎస్ఆర్ హెచ్ వే కావ‌డం విశేషం. అయితే ఈసారి నిబంధ‌న‌లు కాస్త స‌డ‌లించ‌డంతో 300+ మార్కును దాటడం క‌ష్టం మాదిరిగానే క‌నిపిస్తోంది. ఇక ఈ ఎడిష‌న్ లో ఆర్సీబీకి ర‌జ‌త్ పాటిదార్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు అక్ష‌ర్ ప‌టేల్ ల రూపంలో కొత్త కెప్టెన్లు వ‌చ్చారు. ఈ లీగ్ లో వారికి కెప్టెన్సీ అనుభ‌వ‌మే లేదు. అలాగే ఈ జ‌ట్టు కూడా ఐపీఎల్ టైటిల్ ను సాధించ‌లేదు. కొత్త కెప్టెన్ నాయ‌కత్వంలో ఈసారైనా జ‌ట్టు టైటిల్ నెగ్గాల‌ని ఆ టీమ్ ల అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఐపీఎల్ ఈనెల 22 నుంచి అంటే ఈరోజు నుంచే డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడర్స్, ఆర్సీబీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ తో ప్రారంభ‌మ‌వుతుంది.