Virat Kohli 50: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్ ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్నాడు. శనివారం డిఫెండింగ్ చాంపియన్స్ తో ఆడిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన కోహ్లీ ఫిఫ్టీతో అదరగొట్టాడు. అలాగే ఐపీఎల్లో కేకేఆర్ పై 1000 పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీని విజయం వైపు కోహ్లీ నడిపించాడు. కేకేఆర్ విసిరిన 175 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ వడివడిగా ఛేదించింది. ఛేజింగ్ లో ఫిల్ స్టాల్ట్ , కోహ్లీ జోడీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది. వీరిద్దరూ కేకేఆర్ బౌలర్లను చితక బాదడంతో 51 బంతుల్లోనే 95 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. సాల్ట్ కేవలం 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకోగా, కోహ్లీ 30 బంతుల్లలో ఆ మార్కును చేరుకున్నాడు.
భరోసా ఇచ్చిన కోహ్లీ..
ఈ మ్యాచ్ లో కెప్టెన్ కాకపోయినప్పటికీ, జట్టును ముందుకు నడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. సీనియర్ ప్లేయర్ హోదాలో ఈ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న దేవదత్ పడిక్కల్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించాడు. ఎప్పటికప్పుడు అతడితో మాట్లాడుతూ, అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేసేలా కృషి చేశాడు. ఇక నరైన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటవడంతో ఫర్లేదన్నట్లుగా చేయి చూపుతూ, అతడిని పెవిలియన్ కు పంపాడు. ఇక కెరీర్ లో 400వ టీ20 మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు.
పాటిదార్ తో ముచ్చట..
ఇక పడిక్కల్ ఔటయ్యాక.. మ్యాచ్ లో విజయం సాధించడంపై ఒక ప్రణాళికను జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తో చర్చించాడు. దీంతో అతను ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ, ఛేజింగ్ చక్కగా సాగేలా ప్రయత్నించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పటిదార్, ఆ తర్వా త కోహ్లీ పోత్రాహంతో బ్యాట్ ఝుళిపించాడు. ఇక కోహ్లీ టీ20లో 94వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం, ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (108) అందరి కంటే ముందు ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఫీఫ్టీ సాధించాక మైదానంలోని అభిమానులు అతడిని కలిసేందుకు కొంతమంది లోపలికి వచ్చారు. అయితే వారిని సెక్యూరిటీ అడ్డుకుని తిరిగి స్టాండ్స్ లోకి పంపించారు. ఇక ఫస్ట్ మ్యాచ్ లో గెలుపొందిన ఆర్సీబీ శుభారంభం చేసింది. ఆదివారం ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతుండగా, మరో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఇక చెన్నై, ముంబై .. లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. చెరో ఐదు ట్రోఫీలతో టాప్ లో నిలిచాయి.