IPL 2025 Ajinkya Rahane Captain Innings: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ అదిరేలా జరిగింది. ఆరంభంలో నెమ్మదిగా సాగిన ఇన్నింగ్స్, మధ్యలో జెట్ స్పీడ్ అందుకుని, ఆ తర్వాత ఓ మాదిరిగా ముగిసింది. శనివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య, డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టింది. అంతకుముందు అట్టహాసంగా ఆరంభ వేడుకలు జరుగగా, ఆ తర్వాత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (31 బంతుల్లో 56, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో సత్తా చాటాడు. ఆరంభం నుంచి దూకుడైన షాట్లతో విరుచుకుపడి జట్టుకు తూఫాన్ ఆరంభాన్ని అందించాడు. అయితే మరో ఓపెనర్ సునీల్ నరైన్ (44) మిగతా బ్యాటర్లు అంతంతమాత్రంగానే ఆడారు. దీంతో 200 పరుగుల మార్కును చేరలేకపోయింది. బౌలర్లలో క్రునాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇక 2008 ఆరంభ మ్యాచ్ కేకేఆర్ , ఆర్సీబీ జట్ల మధ్యే జరుగగా, 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్ల మధ్య సీజన్ ఫస్ట్ మ్యాచ్ జరగడం విశేషం. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు స్వర్గధామమైన వికెట్ పై కేకేఆర్ భారీగా పరుగులు సాధించలేకపోయింది.
తూఫాన్ స్టార్టింగ్..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు శుభారంభం చేసింది. ఓపెనర్ డికాక్ (4) త్వరగానే ఔటయ్యాడు. అయితే తొలి మూడు ఓవర్లలో 9 పరుగులు చేసిన కేకేఆర్, ఆ తర్వాత జూలు విదిల్చింది. ముఖ్యంగా రహానే వీర బాదుడు బాదడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఆ తర్వాత నరైన్ కూడా బ్యాట్ ఝళిపించడంతో కేకేఆర్ వేగంగా పరుగులు సాధించింది. ఈక్రమంలో 25 బంతుల్లో రహానే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అలాగే రెండో వికెట్ కు 103 పరుగులు జోడించాక నరైన్ ఔటయ్యాడు. కాసేపటి తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్ అనుకున్నంతగా పరుగులు సాధించలేకపోయింది. పాండ్యా అద్భుతంగా కేకేఆర్ ను కట్డడి చేశాడు. చివర్లో అంగ్ క్రిష్ రఘువంశీ (30) వేగంగా పరుగులు సాధించాడు. మిగతా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ రెండు, యష్ దయాల్, రసిక్ సలాం, సుయాంష్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సుయాష్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు.
కామెంటేటర్ గా ఇర్ఫాన్ కు ఉద్వాసన.. ఐపీఎల్ కామెంటేటర్ ప్యానెల్ నుంచి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కు ఉద్వాసన పలికారు. కామెంట్రీలో భాగంగా కొంతమంది ప్లేయర్లపై ఉద్దేశపూర్వకంగా ఇర్ఫాన్ వ్యాఖ్యలు చేస్తుండటంతో అతడిని బీసీసీఐ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో తోపాటు, గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పరుష వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిర్యాదుపై పఠాన్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ సంజయ్ మంజ్రేకర్, హర్షా భోగ్లే లను కూడా కామెంట్రీ నుంచి పక్కన పెట్టగా, తర్వాత వారిని తిరిగి ప్యానెల్లోకి తీసుకున్నారు.