Gayle Meets MS Dhoni:
ఐపీఎల్ 2023కి ముందు ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికను పంచుకున్నారు! యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని కలిశాడు. అతడితో కొన్ని ఫొటోలు తీసుకున్నాడు. అంతే కాదండోయ్! 'లాంగ్ లివ్ ది లెజెండ్స్' అంటూ మహీకి కితాబిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారో తెలుసా!
ఒక ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఎంఎస్ ధోనీని క్రిస్‌గేల్ కలిశాడని తెలిసింది. ఐపీఎల్ 2023 కోసం జియో సినిమా రూపొందిస్తున్న వీడియోలో వీరిద్దరూ నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే జియో సినిమా యూనివర్స్ బాస్‌ను క్రికెట్ విశ్లేషకుడిగా ఎంపిక చేసుకుంది. 2022, డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలం సందర్భంగా అతడు పదునైన విశ్లేషణలు చేశాడు. అభిమానులను ఆకట్టుకున్నాడు.
సాధారణంగా ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు లైవ్‌స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ భాగస్వాములు ఆకట్టుకొనే ప్రమోషనల్ వీడియోలను రూపొందిస్తాయి. గతేడాది వరకు లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ బాధ్యతలు ఒక్కరికే ఉండేవి. ఈసారి ఇద్దరు భాగస్వాములు వచ్చారు. లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని జియో, టెలికాస్టింగ్ హక్కుల్ని స్టార్ దక్కించుకున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నిస్వార్థ క్రికెటర్ ఎవరిని ప్రశ్నించగా క్రిస్‌గేల్.. ఎంఎస్ ధోనీ పేరునే చెప్పాడు. విచిత్రంగా అనిల్ కుంబ్లే, స్కాట్ స్టైరిస్, రాబిన్ ఉతప్ప సైతం అతడి పేరే చెప్పడం గమనార్హం.
ఐపీఎల్ చరిత్రలో ఒక ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు మారని ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే! 2008 నుంచి అతడు చెన్నై సూపర్ కింగ్స్‌ను నడిపిస్తున్నాడు. నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. 2023 సీజన్ అతడికి చివరిదని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎంఎస్ ధోనీ తన వీడ్కోలుపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే హోమ్ అండ్ అవే ఫార్మాట్లో జరిగే 2023 సీజన్లో ప్రతి వేదికలో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తానని స్పష్టం చేశాడు. అందుకే ఈ సీజన్లో సీఎస్‌కేను విజేతగా నిలపాలని పట్టుదలగా ఉన్నాడు. గతేడాది ఆ జట్టు ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.