Travis Head Smashes the Fourth fastest Hundred in IPL History: ఐపీఎల్(IPL) చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. మరోసారి ఉప్పెనలా మారి బెంగళూరు(RCB)పై విరుచుకపడింది. చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది. సిక్సులతో తడిసి ముద్దయింది. హైదరాబాద్(SRH) బ్యాటర్ల విధ్వంసంతో మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే సింగల్ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో... బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. బెంగళూరు వేసిన ప్రతీ బంతి బౌండరీనే అనేలా సాగింది హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం. మాధ్యు హెడ్ శతక గర్జన ... హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసంతో చెలరేగిన సమయాన... హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో మార్పులు చేసుకుని బరిలోకి దిగినా బెంగళూరు బౌలింగ్ ఏమాత్రం బలపడలేదు. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్.. 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో హెడ్ 102పరుగులు చేశాడు. క్లాసెన్ కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. చివర్లో మార్క్రమ్, నబీ కూడా బ్యాట్లు ఝుళిపించడంతో బెంగళూరు బౌలర్లకు కష్టాలు తప్పలేదు.
హెడ్ రికార్డు
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో వంద కొట్టి రెండో స్థానంలో నిలవగా.. డేవిడ్ మిల్లర్ కేవలం 38 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇప్పుడు హెడ్ 39 బంతుల్లో శతకం చేసిన నాలుగో స్థానంలో నిలిచాడు,
అందరూ దంచేశారు
బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్.. 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో హెడ్ 102పరుగులు చేశాడు. శతకం పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్‌ను ఫెర్గూసన్ అవుట్ చేశాడు. 13 ఓవర్‌లో మూడో బంతికి భారీ షాట్ ఆడి మిడాఫ్‌లో హెడ్... డుప్లెసిస్‌కు చిక్కాడు. 13 ఓవర్లకు స్కోరు 171/2. అనంతరం క్లాసెన్ విధ్వంసం ఆరంభించాడు. కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం క్లాసెన్‌ను ఫెర్గూసన్ అవుట్ చేశాడు. తర్వాత మార్క్‌క్రమ్ కూడా ధాటిగా ఆడడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది.