Royal Challengers Bengaluru opt to bowl: వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB).. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్ వైఫల్యంతో వరుసగా విఫలమవుతున్న బెంగళూరు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించి భీకరంగా ఉన్న హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్ ఐపీఎల్‌లో విజయాల బాట పట్టాలని బెంగళూరు పట్టుదలగా ఉండగా.. బెంగళూరుపైనా విజయం సాధించి ప్లే ఆఫ్‌కు అవకాశాలు మరింత పెంచుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు, నాణ్యమైన కోచ్‌లు ఉన్నా ఎందుకు ఓడిపోతున్నామో తెలియక బెంగళూరు సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయంతో సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టాలని ఆర్సీబీ చూస్తోంది. మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను ఈ మ్యాచ్‌కు బెంగళూరు తుది జట్టు నుంచి తప్పించింది.
బెంబేలెత్తిస్తున్న హైదరాబాద్ బ్యాటర్లు
హైదరాబాద్ దూకుడు ఆటతో ప్రత్యర్థులను వణికిస్తోంది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, సమద్, నితీశ్ రెడ్డితో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు బౌలింగ్ అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపధ్యంలో బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ జట్టును బెంగుళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారన్నది చూడాల్సిందే.
పిచ్ రిపోర్ట్
చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు బ్యాటర్లకు కలిసి రానున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువగా అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 47 సార్లు గెలుపొందగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 37 సార్లు గెలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బెంగళూరు, హైదరాబాద్ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 12 విజయాలు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్-బెంగళూరు జట్లు మొత్తం ఎనిమిది మ్యాచుల్లో తలపడ్డాయి, అందులో హైదరాబాద్ కేవలం రెండే మ్యాచులు గెలవగా... బెంగళూరు అయిదు మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. హైదరాబాద్‌లో ఇరు జట్లు 8 మ్యాచుల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు గెలవగా... బెంగళూరు రెండు గెలిచింది.