IPL Brand Value RCB Beat CSK : ఈ ఏడాది టైటిల్ గెలిచి మంచి జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అభిమానులకు మరో శుభవార్త. ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూలో ఆర్సీబీ నెం.1 పొజిషన్ దక్కించుకుంది. ఇప్పటవరకు టాప్ లో నిలిచిన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ ను వెనక్కి నెట్టి 269 మిలియన్ డాలర్లతో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ గెలవడంతో ఆర్సీబీ వ్యాల్యూ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక గతేడాది వరకు నెం.1 స్థానంలో ఉన్న సీఎస్కే నెం.3కి పడిపోయింది. ప్రస్తుతం సీఎస్కే బ్రాండ్ వాల్యూ ఆర్సీబీతో పోలిస్తే చాలా వెనుకంజలో ఉంది. కేవలం 235 మిలియన్ డాలర్లే కావడం విశేషం. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 242 మిలియన్ డాలర్లతో టాప్ 2 ప్లేస్ ను దక్కించుకుంది. ఈ ఏడాది ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, చెత్త ఆటతీరుతో సీఎస్కే టోర్నీలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది.
మిగతా జట్లు ఎలా ఉన్నాయంటే..
రెండుసార్లు చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ 222 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఆరెంజ్ ఆర్మీ బ్రాండ్ విలువ 154 మిలియన్ డాలర్లు కావడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (152), రాజస్థాన్ రాయల్స్ (146), గుజరాత్ టైటాన్స్ (142), పంజాబ్ కింగ్స్ (141), చివరి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ (122 మిలియన్ డాలర్లు)తో నిలిచింది. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన పంజాబ్ బ్రాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది. ఏకంగా 39.6 శాతం పెరగడం గమనార్హం.
18.5 బిలియన్ డాలర్లకు..
ఇక ఐపీఎల్ టోటల్ బ్రాండ్ వ్యాల్యూ కూడా భారీగా పెరడగం విశేషం. గతేడాదితో పోలిస్తే 12.9 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 3.9 బిలియన్ డాలర్ల మేర విలువ పెరిగింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు జరిపిన ఒక స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ ఏడాది చాంపియన్ గా నిలవడంతోపాటు ఐపీఎల్లో ఖరీదైన బ్రాండ్ గా నిలవడం పట్ల కూడా ఆర్సీబీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. తగ్గెదేలో అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఐపీఎల్ అనేది క్రీడా బిజినెస్ లో రోజురోజుకు వేగంగా ఎదుగుతోందని, అనేక బెంచ్ మార్కును సెట్ చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్రాంచైజీల విలువ, మీడియా హక్కుల పెరుగుదల, బ్రాండ్ భాగస్వామ్యం కలిపి ఐపీఎల్ విలువను మరింత బాగా పెరిగేలా చేశాయని తెలిపారు.