Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనేక మలుపులతో సాగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. చూడటానికి ఈ స్కోరు తక్కువగా కనిపించచ్చు కానీ పంజాబ్ కింగ్స్ పాయింట్ వ్యూలో ఇది భారీ స్కోరు. ఎందుకంటే పంజాబ్ ఒక దశలో 88 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
కనీసం 100 పరుగులు సాధిస్తుందా అనే స్థాయి నుంచి కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ (99 నాటౌట్: 66 బంతుల్లో, 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు) పోరాటంతో ఈ స్కోరును సాధించింది. చివరి వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడిస్తే అందులో మోహిత్ రాథీ (1 నాటౌట్: 2 బంతుల్లో) కొట్టింది ఒకటి మాత్రమే. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్, శామ్ కరన్ (22: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా మరెవరూ కనీసం ఆరు పరుగులు కూడా చేయలేకపోయారు.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి బంతి నుంచే పంజాబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను (0: 1 బంతి) భువీ మొదటి బంతికే పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షార్ట్ (1: 3 బంతుల్లో), జితేష్ శర్మ (4: 9 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్‌కు శామ్ కరన్ జతకలిశాడు. వీరు నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించి వికెట్ల పతనానికి కాసేపు అడ్డుకట్ట వేశారు. ఈ దశలో శామ్ కరన్‌ను అవుట్ చేసి మయాంక్ మార్కండే ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 88 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక లాభం లేదనుకున్న శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. అజేయమైన పదో వికెట్‌కు వీరు 55 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. భువీ ఒక వికెట్ పడగొట్టాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్