Sunrisers Hyderabad vs Mumbai Indians  Match Preview: ఐపీఎల్‌ (IPL)సీజన్‌ 17ను పరాజయంలో ప్రారంభించిన ముంబై(MI)-హైదరాబాద్‌(SRH) రెండో సమరానికి సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఓడినా ఇరు జట్లు విజయం కోసం చివరి వరకూ పోరాడి క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై టైటిల్‌ వేటను ప్రారంభించాలని చూస్తుండగా... ముంబైకు షాక్‌ ఇచ్చేందుకు హైదరాబాద్‌ కూడా సిద్ధంగా ఉంది.


 

ముంబై బ్యాటర్లు గాడిన పడతారా

అయిదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేసినా మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ముంబై 36 బంతుల్లో 48 పరుగులు చేయలేక ఓటమిపాలు కావడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లో హార్దిక్‌ ఆకట్టుకోలేక పోయాడు. టిమ్ డేవిడ్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకొచ్చిన హార్దిక్‌... తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగినా విఫలమయ్యాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి వెనుదిరిగాడు. ఇషాన్‌కు టీ 20 ప్రపంచకప్‌ ఆడాలంటే ఐపీఎల్‌లో రాణించడం అవసరం. హైదరాబాద్‌ మ్యాచ్‌లో బ్యాటర్లంతా  గాడినపడాలని ముంబై కోరుకుంటోంది. స్పిన్నర్లు షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా నుంచి హార్దిక్ మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు. 

 

హైదరాబాద్‌ జట్టు ఇలా..

సొంతగడ్డపై ఆడనుండడం హైదరాబాద్‌కు కలిసిరానుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు... కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పరాజయంపాలైన మంచి ఆటతీరు  ప్రదర్శించింది. హెన్రిచ్ క్లాసెన్  అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే హైదరాబాద్‌ గాడిన పడినట్లే. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ SRHకు కీలకంగా మారనుంది. అబ్దుల్ సమద్‌పై హైదరాబాద్‌ భారీ ఆశలు పెట్టుకుంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ రాణిస్తే ముంబై బ్యాటర్లకు తిప్పలు తప్పవు. 

 

ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబికా, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నెహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్. 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్