Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: హైదరాబాద్‌(SRH), లక్నో(LSG) మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకమైన వేళ... వర్షం పడుతుందనే భయం ఇరు జట్ల అభిమానులను  కలవరపెడుతోంది. హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్‌(Uppal) రాజీవ్‌గాంధీ స్టేడియం(Rajivgandhi Stadium)లో ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వర్షపునీరు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగితే మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని GHMC విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల్లో అసలు మ్యాచ్‌ జరుగుతుందా... లేక ఇరు జట్ల ఆశలపై వర్షం నీళ్లు చల్లుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 


 

వర్షం పడితే ఇలా...

మ్యాచ్ ప్రారంభమయ్యాక వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే ఓవర్లను తగ్గిస్తారు. వాన తగ్గాక సమయం ఉంటే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. మ్యాచ్‌ పూర్తిగా రద్దైతే గ్రూప్ దశలో రెండు జట్లకు  ఒక్కో పాయింట్‌ ఇస్తారు. ప్రతీ పాయింట్‌ కీలకమైన దశలో వర్షం పడి మ్యాచ్‌ రద్దయితే ఇరు జట్ల ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. 

 

హైదరాబాద్‌ పిచ్‌ రిపోర్ట్‌

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని  పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌లో పరుగులు సులువుగా వస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంటుంది. 

 

లక్నోకు కష్టమే...

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్‌  ఆరంభంలో మెరుపులు మెరిపించిన గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతోంది. సన్‌రైజర్స్ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఓడిపోయింది. ట్రావిస్ హెడ్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతుండడం హైదరాబాద్‌ను ఆందోళనపరుస్తోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గత నాలుగు మ్యాచుల్లో  కేవలం ఒక్కసారి మాత్రమే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా కీలకసమయంలో వరుసగా విఫలమవుతున్నారు. నటరాజన్ బంతితో స్థిరంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది.