Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఐపీఎల్‌ 2023 సీజన్ 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


లక్నో బ్యాటర్లలో ప్రేరక్ మన్కడ్ (64 నాటౌట్: ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో నిలబడి జట్టు గెలుపులో కీలక పాత్ర సృష్టించాడు. మధ్యలో మార్కస్ స్టోయినిస్ (40: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), చివర్లో నికోలస్ పూరన్ (44 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (47: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ సమద్ (37: 25 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) అతనికి చక్కటి సహకారం అందించాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.


పేలవంగా ప్రారంభం అయి..
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభం అయింది. ఫాంలో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్ (2: 14 బంతుల్లో) ఘోరంగా విఫలం అయ్యాడు. మొదటి ఐదు ఓవర్లలో లక్నో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ ఎంతో పెరిగిపోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి లక్నో వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. లక్నోకు పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు ఇదే.


వన్‌డౌన్‌లో వచ్చిన ప్రేరక్ మన్కడ్ (64 నాటౌట్: ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), క్వింటన్ డికాక్ (29: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) లక్నో ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. డికాక్ అవుటయ్యాకనే లక్నో గేమ్‌లోకి వచ్చింది. ప్రేరక్ మన్కడ్ భాగస్వామ్యాలను బాగా నిర్మించాడు.


రెండో వికెట్‌కు డికాక్‌తో 42 పరుగులు, మూడో వికెట్‌కు మార్కస్ స్టోయినిస్‌తో (40: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కలిసి 73 పరుగులు, నాలుగో వికెట్‌కు నికోలస్ పూరన్‌తో (44 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి అజేయంగా 58 పరుగులు జోడించాడు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ పిడుగుల్లా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఐదు సిక్సర్లు సహా 31 పరుగులు వచ్చాయి. మొదటి రెండు బంతులను సిక్సర్లు కొట్టిన మార్కస్ స్టోయినిస్ మూడో బంతికి అవుటయ్యాడు. అనంతరం నాలుగు, ఐదు, ఆరు బంతులను నికోలస్ పూరన్ సిక్సర్లుగా తరలించాడు. ఈ ఓవర్‌తో మ్యాచ్ ఒక్కసారిగా లక్నో చేతిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా నికోలస్ పూరన్, ప్రేరక్ మన్కడ్ వేగంగా ఆడటంతో లక్నో 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


ఆఖర్లో తడబాటు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాంలో ఉన్న అభిషేక్ శర్మ (7: 5 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (36: 27 బంతుల్లో, ఏడు ఫోర్లు), వన్ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (20: 13 బంతుల్లో, నాలుగు ఫోర్లు) బౌండరీలు కొడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. అయితే రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించాక రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి యష్ ఠాకూర్ లక్నోకు రెండో వికెట్ అందించాడు.


కాసేపటికే అన్‌మోల్ ప్రీత్ సింగ్ కూడా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (28: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్‌లను (0: 1 బంతి) కృనాల్ పాండ్యా వరుస బంతుల్లో అవుట్ చేసి రైజర్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 115 పరుగులు.


అయితే హెన్రిచ్ క్లాసెన్ (47: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), అబ్దుల్ సమద్ (37: 25 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ముఖ్యంగా సమద్ అయితే సిక్సర్లతో చెలరేగాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ అవుటైనా సన్‌రైజర్స్ డీసెంట్ స్కోరు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. యుధ్వీర్ సింగ్, అవేష్ ఖాన్, యష్ ఠాకూర్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ పడగొట్టారు.