Sunrisers Hyderabad List Of Players Full Team After Auction: గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్రయాణం.. అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.  పరుగుల సునామీ సృష్టించి.. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఊచకోత కోసిన రైజర్స్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అత్యధిక రికార్డులను నెలకొల్పారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌తో ప్రత్యర్థి జట్లపై ఎదురుదాడికి దిగగా..  క్లాసెన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.


ఈసారి కూడా మెగా వేలంలోనూ సన్ రైజర్స్ జట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ మెగా వేలంలో పక్క వ్యూహంతో ముందుకు సాగిన సన్ రైజర్స్ హైదరాబాద్... గతంలో కంటే పటిష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ సేవలను కోల్పోయినా... మరో స్టార్ పేసర్ షమీని జట్టులోకి తెచ్చుకుంది. దీంతో ఎప్పటిలాగే హైదరాబాద్ జట్టులో బౌలింగ్ బలంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న హర్షల్ పటేల్‌ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. కమిన్స్, మహ్మద్ షమీ(Mohammed Shami), హర్షల్ పటేల్( Harshal Patel), సిమర్‌జీత్ సింగ్‌, ఉనద్కత్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా(Adam Zampa)తో హైదరాబాద్ బౌలింగ్ లైనప్.. పటిష్టంగా ఉంది.


హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పేది ఏముంది. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్(Pat Cummins), అభిషేక్ శర్మ(Abhishek Sharma), ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డితో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. 


Also Read: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు


కత్తి లాంటి ఆటగాళ్లతో

ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కత్తి లాంటి ఆటగాళ్లను దక్కించుకుంది. కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... దానికి తగ్గట్లుగా ఐపీఎల్ వేలంలో దూకుడు చూపించింది. మెగా వేలంలో జట్టు సమతూకానికి తగ్గట్లు ఆటగాళ్లను దక్కించుకుంది. జట్టుకు అవసరమైన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్. కీలక ఆటగాళ్లను దక్కించుకునేందుకు  ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. కోట్లకు కోట్లు పోటీపడి కుమ్మరించారు. 


 

టీమిండియా సీమర్ మహమ్మద్ షమీ‌ని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన కావ్య పాప.. హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు చేజిక్కించుకున్నారు. హైదరాబాద్ పిచ్‌పై హర్షల్ పటేల్ బౌలింగ్ పనికొస్తుందని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.  చెన్నై మాజీ ఫాస్ట్ బౌలర్ సిమర్‌జీత్ సింగ్‌ను 1.5 కోట్లకు. ఎషాన్ మలింగను 1.2 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు.. 

హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ.