KKR New Captain Shreyas Iyer: అనుకున్నదే జరిగింది! కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ సారథిగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, నైట్స్ గెలాక్సీలోని కొత్త కెప్టెన్‌కు హలో చెప్పండి' అని ట్వీట్ చేసింది.
ఇప్పటి వరకు కోల్‌కతాకు ఐదుగురు నాయకత్వం వహించారు. మొదట ఈ జట్టును సౌరవ్ గంగూలీ నడిపించాడు. ఆ తర్వాత మెక్‌కలమ్‌కు బాధ్యతలు అప్పగించారు. గౌతమ్ గంభీర్ ఏకంగా రెండుసార్లు జట్టును విజేతగా నిలిపాడు. అతడు దిల్లీకి వెళ్లిన తర్వాత దినేశ్ కార్తీక్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. ఆశించిన దూకుడు కొరవడటంతో ఇయాన్ మోర్గాన్‌ను నాయకుడిగా చేశారు.
ఊహించిందే
మెగా వేలానికి ముందు దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌ను కోల్‌కతా రీటెయిన్ చేసుకోలేదు. దాంతో వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది. అతడి కోసం ఆర్‌సీబీ, లక్నో, దిల్లీ, గుజరాత్ పోటీపడ్డాయి. చివరికి కోల్‌కతా అతడిని దక్కించుకుంది. కెప్టెన్సీ కోసమే అతడిని తీసుకున్నట్టు విశ్లేషకులు ముందుగానే ఊహించారు. అనుకున్నట్టే నేడు కెప్టెన్‌గా ప్రకటించారు.
సత్తాగల నాయకుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపుగా తమ కెప్టెన్‌కు దక్కించుకుందని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే శ్రేయస్ అయ్యర్‌ను నాయకుడిగా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేకేఆర్ వద్ద కెప్టెన్సీ అభ్యర్థులు లేరు. గతేడాది ఇయాన్ మోర్గాన్, అంతకు ముందు దినేశ్ కార్తీక్ కోల్‌కతాను నడిపించారు. అయితే వీరి వయసు పెరగడం, దూకుడుగా నడిపించడంలో పస తగ్గడంతో వారిని ఈ ఫ్రాంచైజీ వదిలేసింది. ఒక యువ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. అతడు పరుగులు చేయడమే కాకుండా జట్టును బాగా నడిపించగలడు. దేశవాళీ క్రికెట్లో ముంబయి రంజీ జట్టుకు అయ్యర్ ట్రోఫీలు అందించాడు. ఇక దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు.
రికార్డులదీ అదే మాట
శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగులో 87 మ్యాచులు ఆడాడు. 31.67 సగటుతో 2375 పరుగులు చేశాడు. 16 అర్ధశతకాలూ ఉన్నాయి. మొత్తంగా 41 మ్యాచులకు సారథ్యం వహించి 23 గెలిచాడు. 18 ఓడాడు. టాస్ విజయాల శాతం కూడా 58 శాతంగా బాగుంది. పైగా ప్లేఆఫ్స్, ఫైనల్లో సారథ్యం వహించిన అనుభవం ఉంది. ఇక మొత్తంగా 160 టీ20ల్లో అతడు 31.90 సగటు, 128 స్ట్రైక్‌రేట్‌తో 4180 పరుగులు చేశాడు. 25 అర్ధశతకాలు, 2 శతకాలూ ఉన్నాయి. వన్‌డౌన్, టూ డౌన్ నుంచి ఆఖరి వరకు ఆడగలగడం అయ్యర్ ప్రత్యేకత. వికెట్లు పడుతున్నప్పుడు నిలకడగా ఆడతాడు. సమయం రాగానే బ్యాటు ఝుళిపించడం మొదలు పెడతాడు. మైదానం బయటకూ అతడు సిక్సర్లు బాదేస్తాడు. అందుకే అన్ని విధాలా కోల్‌కతా బంగారు బాతును దక్కించుకుందనే చెప్పాలి.