IPL 2020 Auction, CSK Suresh Raina Unsold:ఐపీఎల్‌ 2022 వేలంలో సురేశ్‌ రైనాను ఫ్రాంచైజీలు తీసుకోకపోవడం తను ఆశ్చర్యం కలిగించిందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అంటున్నాడు. చాలా జట్లకు ఆల్‌రౌండర్లు, సీనియర్‌ క్రికెటర్ల అవసరం ఉందన్నాడు. అయినప్పటికీ అతడిని తీసుకోకవపోడం ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించాడు. బహుశా గతేడాది దుబాయ్‌లో అతడు భయపడుతూ బ్యాటింగ్‌ చేయడమే ఇందుకు కారణం కావొచ్చని వెల్లడించాడు.


ఆశ్చర్యమే


'రైనా విషయంలో నిజంగానే నాకు ఆశ్చర్యం వేసింది. అతడు లెఫ్ట్‌హ్యాండర్‌. ఆఫ్‌స్పిన్‌ వేయగలడు. పైగా అనుభవం ఉంది. గతేడాది ఐపీఎల్‌ దుబాయ్‌లో జరిగింది. అక్కడ పిచ్‌లు బౌన్స్‌ అయ్యాయి. రైనా కాస్త భయపడ్డట్టు కనిపించాడు. ఇప్పుడు భారత్‌లోనూ చాలామంది ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారు. బహుశా వారి బౌలింగ్‌లో ఆడేందుకు భయపడతాడని జనాలు అనుకున్నారేమో! ఏదేమైనా అతడి గురించి ఏం అనుకుంటున్నారో ఫ్రాంచైజీలే చెప్పాలి' అని సన్నీ గావస్కర్‌ అన్నాడు.


కొన్నేళ్లుగా తమకు సేవలందించిన సురేశ్ రైనాను తీసుకోకపోవడం బాధాకరమని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌ అన్నాడు. రెండు రోజుల వేలంలో 25 మందిని తీసుకున్న తర్వాతా వారి వద్ద రూ.2.90 కోట్లు మిగిలే ఉన్నాయి. రైనా కనీస ధర రూ.2 కోట్లే అయినా తీసుకోలేదు.


బాధాకరమే.. కానీ!


'12 ఏళ్లుగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు రైనా నిలకడగా పరుగులు చేశాడు. ఇప్పుడు అతడు లేకపోవడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒక జట్టు కూర్పు, సమతూకం జట్టు ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మేం ఎలాంటి జట్టును బరిలోకి దింపాలని అనుకుంటున్నామో చూడాలి. అతడు జట్టులో ఫిట్‌ అవ్వడనే మేం ఆలోచించాం. ఇంతకు మించి కారణాలేమీ లేవు' అని విశ్వనాథన్‌ అన్నారు.


ఐపీఎల్‌ వేలంలో రైనా పేరు వచ్చినప్పుడు ఫ్రాంచైజీలన్నీ నిరాసక్తి ప్రదర్శించాయి. అతడు ఇన్నాళ్లూ సేవలందించిన చెన్నై సైతం ఆసక్తి చూపించలేదు. దాంతో అన్‌సోల్డ్‌ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. రెండో సారి తన పేరును రైనా జాబితా నుంచి తొలగించుకున్నాడు. అతడిని తీసుకోకపోవడంపై కొందరు అభిమానులు విమర్శలు గుప్పించారు.


Also Read: గంభీర్‌ వ్యూహాలకు ఫిదా! లక్నోను నిజంగానే 'సూపర్‌ జెయింట్‌' చేశాడు!


Also Read: సన్‌రైజర్స్ పూర్తి జట్టు ఇదే, అత్యధిక రేటు ఎవరికంటే?