ఐపీఎల్‌ డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్ చిక్కుల్లో పడింది! తమిళ అభిమానులు ఆ ఫ్రాంచైజీపై విమర్శలు కురిపిస్తున్నారు. 'బాయ్‌కాట్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌' (Boycott Chennai Super Kings) అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. వారి ఆగ్రహానికి ఓ కారణం ఉంది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-15వ సీజన్‌ మెగా వేలం ఆదివారం ముగిసింది. ఈ వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ కొందరు ఆటగాళ్లను తీసుకుంది. శ్రీలంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణను ఎంచుకుంది. అతడు సింహళీయుడు కావడమే తమిళుల ఆగ్రహానికి కారణం.


కొన్నేళ్లుగా శ్రీలంక, తమిళనాడు మధ్య సంబంధాలు బాగుండటం లేదు. 2009లో ఎల్‌టీటీఈపై సింహళ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ను హతమార్చే క్రమంలో అక్కడి సైనికులు కొన్ని వందల తమిళులపై దమనకాండకు పాల్పడ్డారు. వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి జయ లలిత బతికున్నంత వరకు లంక ఆటగాళ్లను ఐపీఎల్‌లో తీసుకోకుండా హెచ్చరించారు!


తాజా సీజన్లో లంక ఆటగాడు మహీశ్‌ తీక్షణను సీఎస్‌కే తీసుకుంది. దాంతో తమిళనాడు నెటిజన్లు బాయ్‌కాట్‌ సీఎస్‌కే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.