IPL 2025 Latest Updates: భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. మళ్లీ ఐపీఎల్లో కనిపించే సూచనలు ఉన్నాయి. తాజాగా తను లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీతో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. నిజానికి గతేడాది మెగా వేలంలో శార్దూల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో అతను అన్ సోల్డ్ గా మిగిలాడు. అయితే తాజాగా లక్నోకి చెందిన వివిధ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటంతో శార్దూల్ ను లక్నో తీసుకుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ జెర్సీతో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను స్వయంగా ఆ జట్టు సోషల్ మీడియా హేండిల్లో షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే అంతకుముందు తను లక్నో ఆటగాళ్లతో కలిసి హోలీ వేడుకను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తను లక్నో తరపున ఆడనున్నట్లు స్పష్టం అవుతోంది. నిజానికి దీనికి సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా లక్నో ప్రకటించలేదు. ఎవరినైనా ప్లేయర్లను తీసుకుంటే కచ్చితంగా బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది.
అపార అనుభవం..
ఇక ఐపీఎల్లో శార్దూల్ కు అపార అనుభవం ఉంది. మేటీ జట్ల తరపున తను ప్రాతినిథ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (ప్రస్తుతం మనుగడలో లేదు) తరపున ఆడాడు. ఇక గత సీజన్ లో సీఎస్కే తరపున శార్దూల్ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ ల్లో ఐదు వికెట్లు తీసి, కేవలం 21 పరుగులే చేశాడు. దీంతో మెగా వేలానికి ముందు తనను రిలీజ్ చేశారు. ఆ తర్వాత నవంబర్ లో జెడ్డాలో జరిగిన మెగా వేలంలో రెండ్రోజులపాటు తను వేలంలోకి వచ్చినా, ఏ జట్టూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
పాత పరిచయంతో..
గతంలో ఆర్పీఎస్ కు ఆడిన అనుభవం ఉండటం, ఆ జట్టు రద్దయినా, సదరు యాజమాన్యానికి చెందిన మరో టీమ్ లక్నో రూపంలో అందుబాటులో ఉండటంతో శార్దూల్ కు మళ్లీ రీ ఎంట్రీకి దారి దొరికింది. ఇక ఐపీఎల్ వేలంలో అన్ సోల్డుగా మిగలడంతో దేశవాళీ క్రికెట్లో ఆడటంపై తను ఫోకస్ పెట్టాడు. ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 24 సగటుతో 15 వికెట్లు తీశాడు. అలాగే రంజీ ట్రోఫీలో 35 వికెట్లతో సత్తా చాటాడు. రంజీ్ల్లో అతని సగటు 22 కావడం విశేషం. అలాగే బ్యాటింగ్ లో విశేషంగా రాణించాడు. ఇక లక్నో జట్టులో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్ తదితర పేసర్లు గాయాల బారిన పడటంతో వాళ్ల స్థానంలో శార్దూల్ ను లక్నో తీసుకునే అవకాశముంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. లక్నో తన తొలి మ్యాచ్ ను ఈనెల 24న విశాఖపట్నంలో ఆడనుంది. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో అమీతుమీ తేల్చుకోనుంది.