IPl Vs PSL Latest Updates: త‌మ‌ను కాద‌ని ఐపీఎల్లో ఆడుతున్నందుకు సౌతాఫ్రికా ఆల్ రౌండ‌ర్ కార్బిన్ బోష్ కు పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్) యాజ‌మాన్యం లీగ‌ల్ నోటీస్ పంపింది. నిజానికి పీఎస్ఎల్ లో బోష్ ఆడాల్సి ఉండ‌గా, స‌డెన్ గా ఐపీఎల్ కు ఎంపిక‌వ‌డంతో అత‌ను పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అత‌నికి లీగ‌ల్ నోటీస్ పంపింది. త‌మ లీగ్ లో పాల్గొంటామ‌ని చెప్పి, ఇప్పుడిలా హేండ్ ఇవ్వ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులో పేర్కొంది. అలాగే నిర్ణీత టైమ్ లోగా త‌న స్పంద‌న చెప్పాల‌ని కోరింది.


ఇక ఈ ఏడాది ఐపీఎల్, పీఎస్ఎల్ రెండూ ఒకే స‌మ‌యంలో జ‌రుగుతుండ‌టంతో ఇలాంటి క్లాష్ వ‌చ్చింది. ఈనెల 22 నుంచి మే 25 వ‌ర‌కు ఐపీఎల్ జ‌రుగుతోంది. అలాగే ఏప్రిల్ 11 నుంచి మే 18 వ‌ర‌కు పీఎస్ఎల్ జ‌రుగుతోంది. పీఎస్ఎల్ టీమ్ పెషావ‌ర్ జెల్మి .. బోష్ ను వేలంలో కొనుగోలు చేసింది. అయితే ప్రారంభంలో అమ్ముడుపోని బోష్.. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు రీప్లేస్ మెంట్ గా తీసుకుంది. సౌతాఫ్రికాకే చెందిన లీజాడ్ విలియ‌మ్స్ గాయ‌ప‌డ‌టంతో అత‌నికి రీప్లేస్మెంట్ గా బోష్ ను కొనుగోలు చేసింది . దీంతో ప్ర‌స్తుతం ఈ వివాదం నెల‌కొంది. 


బీసీసీఐతో ఢీ..
పీసీబీ ఉద్దేశం చూస్తుంటే బీసీసీఐతో ఢీకొనాలని ఉంద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తి ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే పీఎస్ఎల్ ను ఈసారి ఉద్దేశ‌పూర్వ‌కంగా ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యానికి షిఫ్ట్ చేశారు. అలాగే ఇటీవ‌లే పాక్ లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భార‌త జ‌ట్టు అంగీక‌రించ‌లేదు. అందుకే హైబ్రీడ్ మోడ‌ల్లో దుబాయ్ లో ఈ టోర్నీని నిర్వ‌హించారు. ఇక భార‌త్ ఫైన‌ల్ కు చేర‌డంతో, ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే నిర్వ‌హించారు. దీనిపై పీసీబీకి ఆ దేశ అభిమానులు, మాజీల నుంచి అక్షింతలు ప‌డ్డాయి. 29 ఏళ్ల త‌ర్వాత ఐసీసీ టోర్నీ నిర్వ‌హిస్తూ, ఫైన‌ల్ ను త‌మ దేశంలో ఎందుకు నిర్వ‌హించ‌లేద‌ని ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. దీని నుంచి త‌ప్పించుకునేందుకు పీసీబీ ఇలాంటి ఎత్తుగ‌డ‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. 


ఐపీఎల్లో బోష్ అరంగేట్రం.. 
 86 టీ20లు ఆడిన అపార అనుభ‌వం గ‌ల 30 ఏళ్ల బోష్.. 59 వికెట్లు తీశాడు. ఇక‌,  బ్యాటింగ్ చేయ‌గ‌ల ఎబిలిటీ ఉన్న ఈ సౌతాఫ్రికన్ కి ఈ ఫార్మాట్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 81 కావ‌డం విశేషం. త‌న‌ను తీసుకోవ‌డం ద్వారా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ జ‌ట్టును మ‌రింత బ‌లోపేత చేయ‌గ‌ల‌ద‌ని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక జాతీయ జ‌ట్టు త‌ర‌పున అంత‌ర్జాతీయంగా కొన్ని మ్యాచ్ ల‌ను ఆడాడు. ఒక టెస్టు, రెండు వ‌న్డేలు అత‌ను ఆడాడు. ఇక త‌ను ఇంత‌కుముందు ఐపీఎల్లో పాల్గొన్న అనుభ‌వం ఉంది. 2022లో మాజీ చాంపియ‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నెట్ బౌల‌ర్ గా త‌ను సేవ‌లందించాడు.


అలాగే అదే ఏడాది ఆస్ట్రేలియా పేస‌ర్ నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ గాయ‌ప‌డితే అత‌ని స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక ఈ ఏడాది సౌతాఫ్రికా (ఎస్ఏ 20) టోర్నీలో ముంబై ఇండియ‌న్స్ కేప్ టౌన్ త‌ర‌పున బోష్ ప్రాతినిథ్యం వ‌హించాడు. త‌ను ఈ టోర్నీలో విశేషంగా రాణించి, 11 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. దీంతో అటు విలియ‌మ్స్ గాయ‌ప‌డ‌గానే తన స్థానంలో బోష్ ను జ‌ట్టులోకి ఎంపికయ్యాడు. ఇక అత‌ను 2014లో సౌతాఫ్రికా అండ‌ర్-19 చాంపియ‌న్ గా నిలవ‌డంలోనూ కీ రోల్ పోషించాడు. ఫైన‌ల్లో 4-15తో చెల‌రేగి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈనెల‌23 న ముంబై తొలి మ్యాచ్ ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ తో చెన్నైలోనే త‌ల‌ప‌డ‌నుంది.