IPL 2025 MI Vs CSK Updates: భారత మాజీకెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే మిస్టర్ కూల్ అని పేరు.. అయితే ఐపీఎల్ 2019లొ ఒక మ్యాచ్ సందర్భంగా తన కూల్ నెస్ ను కోల్పోయి, ఏకంగా డ్రెస్సింగ్ రూం నుంచి మైదానం మధ్యలోకి వచ్చి, అంపైర్లతో గొడవపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలవడంతో ఈ వివాదం అంతటితో చల్లారిపోయింది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో ఈ సంఘటనను ధోనీ గుర్తు చేసుకున్నాడు. తను అప్పుడలా ప్రవర్తించి ఉండకూడదని విచారం వ్యక్తం చేశాడు. 2019 ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. జైపూర్ లో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో డ్రామా జరిగింది. ఆ ఓవర్లో 20 పరుగుల సాధించాల్సి ఉండగా, ధోనీ మూడో బంతికి ఔటయ్యాడు. తర్వాతి బంతిని బెన్ స్టోక్స్ వేయగా, అది నడుం ఎత్తులో రాగా, నాన్ స్ట్రైకర్ లో ఉన్న అంపైర్ దాన్ని నోబాల్ గా ప్రకటించాడు. అయితే స్వ్కేర్ లెగ్ లో ఉన్న అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫర్డ్ దాన్ని లీగల్ డెలీవరీగా డిక్లేర్ చేశాడు. దీంతో ఆవేశంతో అదుపు తప్పిన ధోనీ, కోపంగా అంపైర్ల వద్దకు దూసుకు వచ్చాడు. చాలా ఎమోషనల్ గా కనిపించిన ధోనీ అంపైర్లతో వాదించాడు. అయితే చివరికి ఆక్సెన్ ఫర్డ్ వాదనతో ఏకీభవించిన మ్యాచ్ నిర్వాహకులు ఆ బంతిని లీగల్ డెలీవరీగా డిక్లేర్ చేశారు. ఆఖరి బంతికి మిషెల్ శాంట్నర్ సిక్సర్ కొట్టి చెన్నైని గెలిపించడంతో ఆ వివాదం సద్దు మణిగింది.
అవేశం వస్తే నోర్మూసుకోవాలి..
ఆ ఘటన జరిగిన దాదాపు ఆరేళ్ల తర్వాత ధోనీ దానిపై స్పందించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు భావోద్వేగాలు అదుపు తప్పుతాయని, ఆ క్షణంలో ఎలా ప్రవర్తిస్తామో తెలియదని పేర్కొన్నాడు. ఆ సమయంలోనే తాను మైదనాంలోకి వెళ్లకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు. ఒకనొక దశలో ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని, చిన్న చిన్న అంశాలు కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు. అలాంటి సమయాల్లో ఎలా ప్రవర్తించాలో ధోనీ సూచించాడు. ఆవేశం అదుపు తప్పితే, కామ్ గా అక్కడి నుంచి వెళ్లిపోవాలని, నోర్మూసుకుని, అంకెలు లెక్కపెట్టుకుని, కోపాన్ని అదుపు చేసుకోవాలని పేర్కొన్నాడు.
ధోనీపై జరిమానా..
అంపైర్లతో ధోనీ వాదించడం అప్పట్లో సంచనలంగా మారింది. ఇక మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చినందుకు అతనికి శిక్ష కూడా పడింది. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించినందుకుగాను అతను మందలింపునకు గురయ్యాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుండగా, చెన్నైలో ఈనెల 23 నుంచి జరిగే మ్యాచ్ తో సీఎస్కే తన ప్రస్థానం మొదలు పెట్టనుంది. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ తో చెన్నై ఢీకొననుంది. ఇక చెన్నైకి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీ.. ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం టీమ్ ను నడిపిస్తున్నాడు.