Rajasthan Royals vs Delhi Capitals: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (65: 55 బంతుల్లో, ఏడు ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు.
డేవిడ్ వార్నర్ మినహా...
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ పృథ్వీ షా (0: 3 బంతుల్లో), వన్‌డౌన్ బ్యాటర్ మనీష్ పాండేలను (0: 1 బంతి) ట్రెంట్ బౌల్ట్ మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు. దీంతో స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు కూడా చేరకుండానే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిలీ రౌసో (14: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
ఈ దశలో డేవిడ్ వార్నర్‌కు లలిత్ యాదవ్ (38: 24 బంతుల్లో, ఐదు ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని ఆపగలిగారు కానీ స్కోరు వేగం మాత్రం బాగా తగ్గిపోయింది. నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించాక లలిత్ యాదవ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేదు. ఒక ఎండ్‌లో వార్నర్ నిలబడ్డప్పటికీ మరో ఎండ్‌లో ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌కు రెండు వికెట్లు, సందీప్ శర్మకు ఒక వికెట్ దక్కాయి.
అదరగొట్టిన ఓపెనర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ ఐదు ఫోర్లు కొట్టాడు. జోస్ బట్లర్ కూడా అదే ఊపు కొనసాగించాడు. దీంతో రాజస్తాన్ పవర్ ప్లే ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ మొదటి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. కెప్టెన్ సంజు శామ్సన్ (0: 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. తర్వాత రియాన్ పరాగ్ (7: 11 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. చివర్లో జోస్ బట్లర్‌కు షిమ్రన్ హెట్‌మేయర్ (39 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) జత కలిశాడు. ముఖ్యంగా హెట్‌మేయర్ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, రొవ్‌మన్ పావెల్‌లకు చెరో వికెట్ దక్కింది.