LSG News: ఐపీఎల్ జట్టు లక్నోసూపర్ జెయింట్స్ తమ నూతన కెప్టెన్‌ను సోమవారం ప్రకటించింది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను నూతన సారథిగా ప్రకటించింది. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌గానే కాకుండా బెస్ట్ ప్లేయర్ కూడా అని జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కొనియాడాడు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కెప్టెన్సీ ప్రకటనతో పాటు నూతన జెర్సీని కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పంత్‌తో పాటు జట్టు మెంటార్ జహీర్ ఖాన్, గోయెంకా పాల్గొన్నారు. 2022లో ఏర్పాటైన ఈ జట్టుకు నాలుగో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు. గతంలో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, క్రునాల్ పాండ్యా తర్వాత జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడు. రాహుల్ పూర్తి కాలపు కెప్టెన్‌గా వ్యవహరించగా, పూరన్, పాండ్యా అడపాదడపా జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. 






టోర్నీ చరిత్రలోనే ఖరీదైన ప్లేయర్..
ఐపీఎల్ మెగా వేలంలో గతేడాది రూ.27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. వేలంలో తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడిన లక్నో.. రైట్ టూ మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎదుర్కొని మరీ పంత్‌ను కైవసం చేసుకుంది. ఈ కార్డును దీటుగా ఎదుర్కునేందుకు రూ.27 కోట్ల మొత్తాన్ని లక్నో ఆఫర్ చేసింది. దీంతో పంత్ ను లక్నో కైవసం చేసుకుంది. 


ఐపీఎల్ చరిత్రలో పంత్ రెండో జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2016లో తొలిసారి ఢిల్లీ జట్టుకు ఎంపికైన పంత్.. గతేడాది వరకు ఆ టీమ్‌తోనే పనిచేశాడు. 2021 నుంచి 23 వరకు కెప్టెన్‌గా పని చేశాడు. అయితే డిసెంబర్ 2022లో గాయం కారణంగా 23 ఎడిషన్‌లో పగ్గాలు చేపట్టలేదు. గతేడాది కూడా ఢిల్లీకి నాయకత్వం వహించాడు. అయితే తన వర్తు తెలుసుకునేందుకు మెగా వేలంలోకి వెళ్లాలని పంత్ నిర్ణయించుకున్నాడు. అయితే అతడిని ఆపాలని ఢిల్లీ జట్టు కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదని తెలుస్తోంది. దీంతో వేలంలోని వచ్చి, కళ్లు చెదిరే ధరను పంత్ దక్కించుకున్నాడు. 


లక్నోకు మంచి రికార్డు..
మూడేళ్ల టోర్నీ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి రికార్డే ఉంది. రెండుసార్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మూడేళ్ల పాటు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. అయితే గతేడాది మెగా వేలంలోకి వెళ్లడంతో నూతన కెప్టెన్ అన్వేషణలో పడింది. మెగావేలంలో అతడిని ఢిల్లీ కొనుగోలు చేయడం విశేషం. అంతకుముందు నికోలస్ పూరన్, మోసిన్ ఖాన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, ఆయూష్ బదోనిలను రిటైన్ చేసుకుంది. వేలంలో పంత్‌తో పాటు డేవిడ్ మిల్లర్, మిషెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్‌లను తీసుకుంది. ఇక ఈ జట్టుకు మెంటార్‌గా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఆస్ట్రేలియాకు చెందిన జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఏదేమైనా కొత్త కెప్టెన్ తోనైనా తొలిసారి ఐపీఎల్ కప్పు అందుకోవాలని గోయెంకా తహతహలాడుతున్నాడు. 


Also Read: Ind Vs Eng T20 Series: ఆటగాళ్లంతా ఒకే బస్సులో బీసీసీఐ 10 పాయింట్స్ రూల్ అమలు.. దశలవారిగా ఒక్కొక్కటి!