5 Sixes In IPL: ఐపీఎల్ 2023లో ఏప్రిల్ 8వ తేదీన గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, రింకూ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి టార్గెట్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా రింకూ సింగ్ నిలిచాడు.


మొదలు పెట్టింది యూనివర్స్ బాస్
ఐపీఎల్‌లో యూనివర్స్ బాల్ క్రిస్ గేల్ ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడం ప్రారంభించాడు. ఐపీఎల్ 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నప్పుడు పుణే వారియర్స్‌పై గేల్ మొదటిసారిగా ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. పుణే బౌలర్ రాహుల్ శర్మ బౌలింగ్‌లో గేల్ ఈ ఫీట్ సాధించాడు.


IPLలో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితా
1. క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) vs రాహుల్ శర్మ (పుణె వారియర్స్), బెంగళూరు, 2012.
2. రాహుల్ తెవాటియా (రాజస్తాన్ రాయల్స్) Vs షెల్డన్ కాట్రెల్ (పంజాబ్ కింగ్స్), షార్జా, 2020.
3. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) vs హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ముంబై WS, 2021.
4. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్ (LSG) Vs శివమ్ మావి (కోల్‌కతా నైట్‌రైడర్స్), పుణే, 2022.
5. రింకూ సింగ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) vs యష్ దయాళ్ (గుజరాత్ టైటాన్స్), అహ్మదాబాద్, 2023.


గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 21 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సర్ల సాయంతో 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 228.57గా ఉంది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో మొత్తం 46 పరుగులు చేశాడు.


వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమికి కారణమైన యశ్‌ దయాల్‌కు చాలామంది అండగా నిలుస్తున్నారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడైన స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో యంగ్‌ బెన్‌స్టోక్స్‌ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. ఒక్క మ్యాచుతోనే అయిపోలేదని ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఐదు సిక్సర్లు బాదేసిన రింకూ సింగ్‌ సైతం యశ్‌ దయాల్‌కు చక్కని సందేశం పంపించాడు.


ఐదు సిక్సర్లు ఇవ్వడంతో ఆవేదనకు గురైన యశ్‌ దయాల్‌ మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. తనను తానే నమ్మలేకపోయాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతడికి కుటుంబ సభ్యులు, గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు, సహచరులు, మాజీ క్రికెటర్లు ధైర్యం చెబుతున్నారు. ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్‌ సైతం ఓ సందేశం పంపించాడు. 'మ్యాచ్‌ ముగిశాక యశ్‌కు సందేశం పంపించాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతుంటాయి. గతేడాది నువ్వు అద్భుతంగా ఆడావని అతడిని మోటివేట్‌ చేసేందుకు ప్రయత్నించా' అని తెలిపాడు.