Rinku Singh - Yash Dayal: 


వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమికి కారణమైన యశ్‌ దయాల్‌కు చాలామంది అండగా నిలుస్తున్నారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడైన స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో యంగ్‌ బెన్‌స్టోక్స్‌ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. ఒక్క మ్యాచుతోనే అయిపోలేదని ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఐదు సిక్సర్లు బాదేసిన రింకూ సింగ్‌ సైతం యశ్‌ దయాల్‌కు చక్కని సందేశం పంపించాడు.




నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆదివారం తలపడ్డ సంగతి తెలిసిందే. జీటీ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో కేకేఆర్‌కు 29 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో తాత్కాలిక కెప్టెన్‌ రషీద్ ఖాన్‌ యువ లెఫ్టార్మ్‌ పేసర్‌ యశ్‌ దయాల్‌కు బంతినిచ్చాడు. మొదటి బంతికి ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. అదే జీటీ కొంప ముంచింది. చివరి ఐదు బంతుల్నీ అతడు ఐదు సిక్సర్లుగా మలిచి అద్భుతం చేశాడు. తిరుగులేని విజయం అందించాడు. యశ్‌ ఊహించని షాక్‌ తగిలింది.


ఐదు సిక్సర్లు ఇవ్వడంతో ఆవేదనకు గురైన యశ్‌ దయాల్‌ మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. తనను తానే నమ్మలేకపోయాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతడికి కుటుంబ సభ్యులు, గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు, సహచరులు, మాజీ క్రికెటర్లు ధైర్యం చెబుతున్నారు. ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్‌ సైతం ఓ సందేశం పంపించాడు. 'మ్యాచ్‌ ముగిశాక యశ్‌కు సందేశం పంపించాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతుంటాయి. గతేడాది నువ్వు అద్భుతంగా ఆడావని అతడిని మోటివేట్‌ చేసేందుకు ప్రయత్నించా' అని తెలిపాడు.




యశ్‌ దయాల్‌ తండ్రి చందర్‌పాల్‌ దయాల్‌ సైతం కొడుక్కి ఊరట కల్పించేందుకు ప్రయత్నించాడు. మ్యాచ్‌ ముగియగానే స్టేడియంలోనే కుటుంబ సభ్యుల్ని యశ్‌ వద్దకు పంపించాడు. డిప్రెస్‌ అయిన తన కుమారుడిని ఓదార్చాలని చెప్పాడు. 'అతడు చాలా తక్కువ మాట్లాడతాడు. ఇంట్రోవర్ట్‌. ఇలాంటి సందర్భాల్లో స్తబ్దుగా ఉండిపోతాడు' అని పేర్కొన్నాడు. గతంలో ఓ క్రికెట్‌ టోర్నీలో తనకూ ఇలాంటి సంఘటనే ఎదురైన విషయాన్ని పంచుకున్నాడు.


'1980 దశకంలో నేను విజ్జీ ట్రోఫీ ఆడాను. నేనూ క్రికెటర్‌నే. కానీ తల్లిదండ్రులుగా మేం భిన్నంగా ఉంటాం. నేనూ కొద్దిగా బాధపడ్డాను. నా కొడుకు గురించి ఆందోళన పడ్డాను. తర్వాతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియానికి వస్తానని చెప్పాను. భయపడొద్దు యశ్‌. క్రికెట్లో ఇదేం కొత్త కాదు. బౌలర్లను బ్యాటర్లు బాదేస్తుంటారు. పెద్ద పెద్ద బౌలర్లకూ ఇది అనుభవమే. హార్డ్‌ వర్క్‌ చెయి. పొరపాట్లను సరిదిద్దుకో. కానీ క్రికెట్లో ఇలాంటిది జరగడం ఇదే మొదటి సారి కాదని తెలుసుకో. మలింగ, స్టువర్ట్‌ బ్రాడ్‌ వంటి పెద్ద బౌలర్లకూ జరిగిందని ఓదార్చాను' అని చందర్‌పాల్‌ దయాల్‌ అన్నారు.