IPL 2025 News: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 17 సీజన్లుగా ఆడుతున్న ఒక్క టైటిల్ గెలవకపోయినా, ప్రతి ఏడు ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టు తరపున ఆడుతుండటంతో సీజన్ జరుగుతున్నప్పుడల్లా ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్ వినిపించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆ జట్టు కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగా కాకుండా రజత్ ను కెప్టెన్ గా ఎన్నుకుని షాకిచ్చింది. నిజానికి కోహ్లీని ఈ సీజన్ కు కెప్టెన్ గా చేస్తారని అందరూ భావించారు. అందుకే మెగావేలంలో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి కెప్టెన్సీ మెటిరీయల్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వారిని కొనుగోలు చేయలేదు. దీంతో కోహ్లీనే ఈ సారి కెప్టెన్ అనే క్లారిటీ అభిమానులకు వచ్చింది. తాజా నిర్ణయంతో ఆర్సీబీ కొత్త వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది.
దీర్ఘకాల వ్యూహంతోనే..
నిజానికి తమ టీమ్ విషయానికి వస్తే కెప్టెన్సీపై పెద్దగా ఆలోచించబోమని జట్టు డైరెక్టర్ మో బొబాట్ పేర్కొన్నాడు. తామంతా జట్టుగా విజయాలు సాధిస్తామని భావిస్తామని, అందులో ప్రత్యేకంగా కెప్టెన్ గా ఎవరుండాలనే విషయంలో అంతగా ఆలోచించబోమని, క్రికెట్ అనేది టీమ్ ప్లే అని, దానికి కట్టుబడే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఇక రజత్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడంతో దీర్ఘకాల వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. యువకుడైన రజత్ చాలాకాలం పాటు జట్టును నడిపించగలడని, జట్టుతో మమేకం కాగలడని అభిప్రాయ పడుతున్నారు. కోహ్లీ లాంటి సీనియర్లు అండగా ఉండటంతో జట్టును నడిపించడం పెద్దగా కష్టమేమీ కాదని తెలిపింది.
డుప్లెసిస్ రిలీజ్ అందుకే..
ఇప్పటికే నడి వయస్కుడైన ఫాఫ్ డుప్లెసిస్ ను గతేడాది మెగావేలానికి ముందు ఆర్సీబీ రిలీజ్ చేసింది. గతేడాది సీజన్ లో తను అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఫాఫ్ ను వదిలేశారని సమాచారం. ఇక మధ్య ప్రదేశ్ కు చెందిన రజత్ కు కెప్టెన్సీ అనుభవం అంతగా లేదు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే వన్డే కప్ లో మాత్రం మధ్యప్రదేశ్ కు నాయకత్వం వహించాడు. 2008 నుంచి ఆడుతున్న ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ కు చేరిన రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. 2009లో హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ (ఉనికిలో లేదు), 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ పరాజయం పాలైంది. గత ఎనిమిదేళ్లుగా కనీసం ఫైనల్ కు కూడా చేరుకోలేదు. గత డబ్ల్యూపీఎల్ సీజన్ లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ సీజన్ లో కప్పు కొట్టాలని అభిమానులు ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరుతున్నారు.