Pak Vs SA Odi: ముక్కోణపు వన్డే సిరీస్ లో ఓవర్ యాక్షన్ చేసినందుకు గాను ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లపై ఐసీసీ కన్నెర్ర చేసింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకుగాను ముగ్గురు క్రికెటర్లు షాషిన్ షా ఆఫ్రిది, సౌద్ షకీల్, సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ లపై కొరడా ఝుళిపించింది. ఆర్టికల్ 2.12 ను ఉల్లంఘించినందుకుగాను షాషిన్ పై 25 శాతం జరిమానా విధించింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 28వ ఓవర్లో బ్యాటర్ మథ్యూ బ్రిట్జ్క్ ను అడ్డుకున్నందుకు గాను ఐసీసీ జరిమానా విధించింది.
ఇక షకీల్, గులామ్ .. ఆర్టికల్ 2.5 ఉల్లంఘించినందుకుగాను వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్ అయిన సందర్భంగా అనుచితంగా సంబరాలు చేసినందుకుగాను వీరిద్దరిపై కొరఢా ఝులిపించింది. అలాగే ఈ ముగ్గురికి ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. గత 24 నెలల్లో వీళ్లు ఒక్క డీ మెరిట్ పాయింట్ కూడా లేకపోవడంతో ప్రస్తుతానికి నిషేధం లాంటి ముప్పులేదు.
శిక్షను అంగీకరించిన ప్లేయర్లు..మరోవైపు తమకు విధించిన శిక్షలను ఆటగాళ్లు అంగీకరించారని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో శిక్షపై అప్పీలు లాంటివేమీ లేదని వ్యాఖ్యానించింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్ పై సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌతాఫ్రికా బ్యాటర్ మథ్యూను మొరటుగా అడ్డుకున్న షాహిన్ వ్యవహర శైలిని తప్పుపడుతున్నారు. క్రీడా స్పూర్తిని మరిచి మరీ షాహిన్ ప్రవర్తించారని దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే బవూమా ఔటైన క్రమలో పాక్ ఆటగాళ్లు షకీల్, గులామ్ చేసిన సంబరాలు కూడా శ్రుతి మించాయని చురకలు అంటించారు. ఏదేమైనా సౌతాఫ్రికాతో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ సరికాదని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఫైనల్లో పాకిస్థాన్..ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో పాక్ ప్రవేశించంది. తాజాగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో పాక్ అద్భుత విజయం సాధించింది. లాహోర్లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (87), మథ్యూ (83), బవూమా (82) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో షాహిన్ కు రెండు , నసీమ్ షా, ఖుష్ దిల్ షాకు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేదనను 49 ఓవర్లలో 4 వికెట్లకు 355 పరుగులు చేసి, పూర్తి చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సల్మాన్ ఆఘా (134), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్) సెంచరీలతో రాణించి, జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఒకదశలో 91-3 తో నిలిచిన పాక్ ను వీరు ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు ఏకంగా 260 పరుగులు జోడించారు. వలాన్ మల్డర్ కు రెండు వికెట్లు దక్కాయి. శుక్రవారం జరగే ఫైనల్లో న్యూజిలాండ్ తో పాక్ తలపడనుంది.
Read Also: BCCI Rules: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్లేయర్లకు ఝలక్.. వాళ్లకు నో ఎంట్రీ..!