IPL 2024: రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ... 12 ఏళ్ల కరవు తీరినట్టైంది.... నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద హిట్ మ్యాన్ సెంచరీ చేశాక. ఐపీఎల్ లో రోహిత్ కు ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ... 2012 సీజన్ లో కేకేఆర్ మీద సాధించాడు. ఇన్నేళ్ల తర్వాత సాధించిన శతకం కాబట్టి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ రోహిత్ ఒంటరి పోరాటం చేయటంతో మ్యాచ్ ముంబయి ఓడిపోయింది. శతకం వృథా అయింది. కానీ మరో 2 నెలల్లో టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ ఫాం ఇండియా అంతటికీ సంతోషాన్నిచ్చేదే.


ఇక ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వచ్చిన దగ్గర్నుంచి... రోహిత్ ఫ్యాన్స్  తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే సీజన్ కు ముంబయిని వదిలేసి, వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోవాలని వారంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఆన్ లైన్ లో దీని గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. 2025లో మెగా ఆక్షన్ ఉంటుందని, దాని తర్వాత రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ కు లేదా చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లిపోతాడని చాలా మంది అంచనాలు వేశారు.


అయితే ఇప్పుడు తెరమీదకు ఇంకో ఫ్రాంచైజీ పేరు వచ్చింది. ఫ్యాన్స్ తెచ్చింది కాదు.. ఏకంగా ఆ ఫ్రాంచైజీ సహ యజమానే రోహిత్ పేరును ప్రస్తావించారు. ఆ ఫ్రాంచైజీయే పంజాబ్ కింగ్స్. దాని సహ యజమాని ప్రీతి జింతా... రోహిత్ గురించి మాట్లాడారు.


ఒకవేళ రోహిత్ శర్మ మెగా వేలంలో అందుబాటులోకి వస్తే, తన దగ్గరున్నదంతా బిడ్ చేస్తానని ప్రీతి జింతా అన్నారు. తమ జట్టుకు స్టెబిలిటీ, ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ లేడని, అందుకే రోహిత్ కోసం ప్రయత్నిస్తామని ప్రీతి అన్నారు. మరి రోహిత్ శర్మ... వచ్చే సీజన్ నాటికి ముంబయిని వదిలేసి తనను తాను వేలంలోకి తెచ్చుకుంటాడో లేదా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను బుజ్జగిస్తుందో మరికొన్ని నెలల్లో తెలుస్తుంది.