Pragyan Ojha on Rohit Sharma:
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాల్యంలో ఎన్నో కష్టాల్ని అనుభవించాడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. అతడు పేదరికం నుంచి వచ్చాడని గుర్తు చేశాడు. కిట్ బ్యాగులు కొనేందుకు ఒకప్పుడు పాల ప్యాకెట్లు అమ్మేవాడని వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) నేపథ్యంలో అతడు జియో సినిమాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
'అండర్-15 నేషనల్ క్యాంపులో తొలిసారి రోహిత్ శర్మను కలుసుకున్నాను. అతడో ప్రత్యేకమైన ఆటగాడని అంతా చెప్పేవారు. ప్రత్యర్థి జట్టులో ఆడి నేను అతడి వికెట్ తీశాను. ముంబయి నుంచి వచ్చినా ఎందుకో అతడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఆడేటప్పుడు మాత్రం అగ్రెసివ్‌గా ఉంటాడు. మా ఇద్దరికీ ఎక్కువ పరిచయం లేకపోయినా అతడెందుకు నా బౌలింగ్‌ను దూకుడుగా ఆడేవాడే అర్థమయ్యేది కాదు. కానీ ఆ తర్వాతే మా ఫ్రెండ్‌షిప్ మొదలైంది' అని ఓజా అన్నాడు.
'హిట్‌మ్యాన్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. క్రికెట్ కిట్లు కొనేందుకు డబ్బు లేకపోవడం గురించి మాట్లాడితే వెంటనే ఎమోషనల్ అయ్యేవాడు. నిజం చెప్పాలంటే అతడు పాల ప్యాకెట్లూ అమ్మాడు. అయితే అదంతా చాలా కాలం కిందట! అలా పాల ప్యాకెట్లు వేసి కిట్ కొనేవాడు. అందుకే అతడిని ఇప్పుడు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అలా మొదలైన మా ప్రయాణం ఇలా కొనసాగుతున్నందుకు హ్యాపీగా ఉంది' అని ప్రజ్ఞాన్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం సీజన్ నుంచి ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మకు అనుబంధం ఉంది. వీరిద్దరూ మొదట డక్కన్ ఛార్జర్స్‌కు ఆడారు. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. మళ్లీ వీరిద్దరూ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడారు. 2007 నుంచి ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ ఎన్ని సంచలనాలు సృష్టించాడో అందరికీ తెలిసిందే. వన్డేల్లో డబుల్ సెంచరీలు, ప్రపంచకప్పుల్లో వరుస శతకాలు, పరుగుల సునామీలు సృష్టించాడు. ముంబయికి ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మొత్తం ఆరు ట్రోఫీలు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు టీమ్‌ఇండియాకు ప్రపంచకప్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు.
IPL 2023 Mumbai Indians Schedule: ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ మ్యాచ్ తన మొదటి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో తమ ఐపీఎల్ పోటీని ప్రారంభించనుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది.