Ganguly on Rishabh Pant:
టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) ప్రత్యామ్నాయం వెతకడం కష్టమని సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు. ఎవ్వరొచ్చినా అతడిలా ఆడటం కష్టమని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ వేర్వేరు ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నారని చెప్పాడు. అయితే ఎవరి స్టైల్ వారిదేనని వెల్లడించాడు. ప్రస్తుతం దాదా దిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
'రిషభ్ పంత్ చాలా స్పెషల్. అలాంటి క్రికెటర్ ఈజీగా దొరకడు. కానీ ఇషాన్ కిషన్ (Ishan kishan) అద్భుతంగా ఆడుతున్నాడు. కేఎస్ భరత్ అందుబాటులో ఉన్నాడు. అయితే వారిద్దరూ భిన్నంగా ఆడతారు. అందరూ ఒకేలా బ్యాటింగ్ చేయరు. అవకాశాలు దొరికినప్పుడు వీరు రాణిస్తారు. పొట్టి ఫార్మాట్లో కిషన్ ఎలా రెచ్చిపోతాడో తెలిసిందే. వన్డేల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) 45 సగటుతో రెచ్చిపోతున్నాడు. వన్డేల్లో అతడికి తిరుగులేదు. అతడు బాగా ఆడితే ఎలాంటి సమస్యే ఉండదు' అని దాదా అన్నాడు.
ఈ ఏడాది ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఉండటంతో ఆటగాళ్ల పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుందని గంగూలీ చెప్పాడు. 'క్రికెటర్లు బాగానే ఉన్నారు. ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం క్రికెటింగ్ షెడ్యూలు బిజీగా ఉంటోంది. ఆటగాళ్లు అందుకు తగ్గట్టే ఆడుతున్నారు. నాకేమీ ప్రాబ్లమ్ అనిపించడం లేదు. ఐపీఎల్ తర్వాత ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు పది రోజుల విరామం దొరుకుతోంది. వారు మేనేజ్ చేసుకోగలరు' అని గంగూలీ వివరించాడు.
మెగా టోర్నీల్లో ఆడాల్సిన విధానంపై దాదా స్పందించాడు. 'టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలి. ప్రత్యేకించి టీ20ల్లో మరింత అగ్రెసివ్‌గా ఉండాలి. అలాంటి జట్టు మనకుంది. సిక్సర్లు కొట్టగల అక్షర్ పటేలే తొమ్మిదో స్థానంలో వస్తున్నప్పుడు నిర్భయంగా ఆడితే తప్పేం లేదు. పైగా పాండ్య 6, జడ్డూ 7 స్థానాల్లో వస్తున్నారు. బ్యాటింగ్‌లో చాలా డెప్త్ ఉంది. ఒత్తిడిని జయించడమే ముఖ్యం. పరిస్థితులకు తగినట్టుగా ఆడాలి. భారత క్రికెట్లో ఎంతో ప్రతిభ ఉంది. చాలామంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. జాతీయ స్థాయికి ఆడేందుకు రెడీగా ఉన్నారు. పెద్ద టోర్నీలకు ఇలాగే సిద్ధమవ్వాలి' అని వెల్లడించాడు.
'సెలక్టర్లు ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్‌లో ఆడాడని గుడ్డిగా ఎంపిక చేయరు. బహుశా టీ20లకు పరిగణనలోకి తీసుకోవచ్చు. అన్ని ఫార్మాట్లలో ఎవరెలా ఆడుతున్నారో వారికి తెలుసు. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చూసుకుంటారు. తమకు ఎవరు కావాలో చెప్తారు. నాకు తెలిసి వారు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఇండియన్ క్రికెట్‌కు మంచే చేస్తారు' అని దాదా చెప్పాడు.