Cricket News: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కే కాకుండా, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2016, 17 సీజన్లలో నిషేధం కారణంగా చెన్నై, రాజస్తాన్ రాయల్స్ మెగాటోర్నీకి దూరమైతే, వాటి స్థానంలో పుణే, గుజరాత్ లయన్స్ ఐపీఎల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు సీజన్లు ఆడిన తర్వాత ఆ జట్లను బీసీసీఐ తొలగించి, తిరిగి చెన్నై, రాజస్థాన్ జట్లకు అవకాశం కల్పించింది. అయితే 2016లో పుణే టేబుల్ పాయింట్లలో అడుగున నిలవడంతో కెప్టెన్ గా ధోనీని ఆ జట్టు యాజమాని సంజీవ్ గోయెంకా తప్పించారు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ కు పగ్గాలు అప్పగించారు. తర్వాతి సీజన్లో పుణే రన్నరప్ గా నిలిచింది. ఆ సంఘటన గురించి తాజాగా గోయెంకా మనసులో మాట విప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు ధోనీతో తనకేమీ అభిప్రాయ బేధాలు రాలేదని చెప్పుకొచ్చాడు. 


Also Read: Rohit Vs Jaiswal: జైస్వాల్‌ను హోటల్‌లో వదిలేసి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన రోహిత్‌ టీం!


ధోనీ నిజంగానే మిస్టర్ కూల్..
కెప్టెన్సీలో మార్పు తర్వాత తమ మధ్య బేధాభిప్రాయాలేవీ రాలేదని గోయెంకా గుర్తు చేసుకున్నాడు. తమ మధ్య స్నేహ సంబంధాలు అలాగే ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గోయేంకా యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ధోనీ.. రూ.4 కోట్లతో చెన్నైకి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. దాదాపు ఇదే అతని చివరి సీజన్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే లక్నో-చెన్నై మ్యాచ్ సందర్భంగా ధోనీ తమ ఇంటికి వచ్చేవాడని, తన మనవడితో గంటల కొద్ది సమయం గడిపేవాడని పేర్కొన్నాడు. 


Also Read: World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు


ధోనీకి చాలా ఓర్పు ఎక్కువ..
నిజానికి ప్రశ్నలతో తన మనవడు ధోనీని విసిగించినా, చాలా ఓపికతో సమాధానాలు చెప్పేవాడని, ధోనిలోని ఈ గుణం తననెంతో ఆకర్షించిందని గోయెంకా పేర్కొన్నాడు. ధోనీ ఇప్పటికీ కొత్తగా ఆలోచించి, తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంటాడని కొనియాడాడు. ఇక ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతి పోతుందని వ్యాఖ్యానించాడు. తమ సొంతగడ్డ లక్నోలో మ్యాచ్ జరిగినప్పటికీ, అభిమానులు ధోనీకి సపోర్టుగా పసుపురంగు జెర్సీలు వేసుకుని మైదానం మొత్తం నిండిపోయేవారని అభిప్రాయపడ్డాడు. మరోవైపు 2025 సీజన్ కోసం లక్నో చాలా మార్పులే చేసింది. గత సీజన్ కెప్టెన్ రాహుల్ ని వేలంలోకి విడిచిపెట్టిన లక్నో.. భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను రూ.27 కోట్లతో కొనుగోలు చేసింది. దాదాపు అతనికే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశముంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. అతని సారథ్యంలో చెన్నై ఐదుసార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2019లో టీమిండియాకు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల ధోనీ.. ఐపీఎల్ మినహా మరే టోర్నీలోనూ కనిపించడం లేదు.