Gukesh As World Chess Championship: యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ (Gukesh) సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో నువ్వా.? నేనా.? అన్నట్లుగా సాగిన గేమ్‌లో చివరికి గుకేశ్‌నే విజయం వరించింది. విశ్వనాథన్ ఆనంద్ (5 సార్లు) తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. ఈయన తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవాడు. కాగా, బుధవారమే ఈ ఫలితం తేలాల్సి ఉండగా.. సుమారు 5 గంటలపాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినా.. ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయ్యింది. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ 7.5తో విజేతగా నిలిచాడు.
చెస్ ప్రపంచం దృష్టిలో.. మంచి ఫామ్‌లో ఉన్న 18 ఏళ్ల గుకేశ్ ఫేవరెట్. అతను.. నెపోమ్నియాషి, కరువానా, నకముర వంటి మేటి గ్రాండ్ మాస్టర్స్‌ను తోసిరాజని క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా లిరెన్‌తో పోరుకు అర్హత సాధించి.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి స్వర్ణం గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
'పదేళ్ల కల సాకారమైంది'
18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంతో తన పదేళ్ల కల సాకారమైందన్నాడు. ఈ క్షణం కోసం తాను దశాబ్దాలుగా కలలు కన్నానని, అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ విజయాన్ని ఊహించలేదని.. అందుకే కాస్త భావోద్వాగానికి లోనయ్యాడని చెప్పాడు. 'ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో గెలవాలనే కల.. నాకంటే నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉంది. వారి ప్రోత్సాహం ఎనలేనిది. నా దృష్టిలో డింగ్ లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్. అతడి ఓటమి బాధగా ఉంది. డింగ్, అతని బృందానికి ధన్యవాదాలు. విజయం సాధిస్తానని ఊహించలేదు. కానీ, అవకాశం రావడంతో పావులు కదిపా. పదేళ్ల కల నెరవేరింది. ఈ క్షణం కోసం పదేళ్లుగా కలలు కన్నా. ఊహించని విజయానికి భావోద్వేగానికి గురయ్యా. ఈ ఛాంపియన్‌షిప్ గెలిచినంత మాత్రాన నేనేనీ ఉత్తమ ప్లేయర్‌ను కాదు. అది కేవలం మాగ్నస్ కార్ల్‌సనే' అని గుకేశ్ పేర్కొన్నాడు.
రాష్ట్రపతి ప్రశంసలు
గుకేశ్.. దేశం గర్వపడేలా చేశారని భారత రాష్ట్రపతి పేర్కొన్నారు. 'అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు అభినందనలు. అతడి అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయం. చెస్ చరిత్రలో గుకేశ్ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ఈ గెలుపు ప్రేరణగా నిలుస్తుంది.' ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read: Rohit Vs Jaiswal: జైస్వాల్‌ను హోటల్‌లో వదిలేసి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన రోహిత్ టీం!