Kolkata Knight Riders secured a playoff berth:  ఐపీఎల్(IPL)-2024లో ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్‌కత్తా(KKR) నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై(MI)పై విజయం సాధించి.... కోల్‌కత్తా ప్లే ఆఫ్‌(Playoff)లో అడుగుపెట్టింది. వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభంకాగా... మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌  నిర్ణీత 16 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.  లక్ష్యఛేదనలో ముంబై 139 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనను ఘనంగానే ఆరంభించినా.... తర్వాత ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు.




 

కోల్‌కత్తా అదే ఊపు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై,... కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే కోల్‌కత్తాకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఆరు పరుగులు చేసి సాల్ట్‌  ఔట్‌ అయ్యాడు. తుషార్‌ వేసిన బంతిని భారీ షాట్‌ ఆడబోయి సాల్ట్‌ కంబోజ్‌ చేతికి చిక్కాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ బౌల్డయ్యాడు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నరైన్‌ డకౌట్‌ కావడంతో కోల్‌కత్తా కేవలం 15 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్‌ అయ్యర్‌... బుమ్రా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదాడు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న వేళ కోల్‌కత్తాకు మరో షాక్‌ తగిలింది. కోల్‌కతా మూడో వికెట్‌ కోల్పోయింది. కంబోజ్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి ఏడు పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ బౌల్డయ్యాడు. అయిదు ఓవర్లకు కోల్‌కత్తా స్కోరు 45/3. హార్దిక్ పాండ్య వేసిన ఆరో ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న వెంకటేశ్ అయ్యర్ ఔట్ అయ్యాడు. దూకుడుగా ఆడిన వెంకటేశ్‌ అయ్యర్ 21 బంతులలో 42 పరుగులు చేసి పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చి రాగానే ఆండ్రీ రస్సెల్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. 11 ఓవర్లో కోల్‌కతా స్కోరు 100 దాటింది. తర్వాత 33 పరుగులు చేసిన నితీశ్ రాణ అవుటవ్వడంతో కోల్‌కత్తా ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన ఓవర్‌లో నితీష్‌రాణాను తిలక్‌ వర్మ... నితీశ్‌రాణాను రనౌట్ చేశాడు. కాసేపటికే కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. 14 బంతుల్లో 24 పరుగులు చేసిన రస్సెల్‌... పీయూష్‌ చావ్లా వేసిన 13 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి డీప్ స్క్వేర్‌ లెగ్‌లో కంబోజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రింకూ  సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 16 ఓవర్లలో కోల్‌కత్తా ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

 

శుభారంభం దక్కినా...

158 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకు మంచి ఆరంభమే దక్కింది. ఇషాన్‌ కిషన్ దూకుడుకు తోడు రోహిత్ నిలకడగా ఆడటంతో ముంబై పవర్ ప్లే ముగిసేసరికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. ఆ తర్వాతే ముంబై ఆట గాడి తప్పింది. ఇషాన్‌ కిషన్‌ 22 బంతుల్లో 40 , తిలక్‌ వర్మ 17 బంతుల్లో 32 , రోహిత్ శర్మ 24 బంతుల్లో 19 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. హార్దిక్ పాండ్య 2, టిమ్ డేవిడ్ 0, నేహల్ వధేరా 3 విఫలమయ్యారు. చివర్లో తిలక్, నేహల్ వధేరా మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్‌కు ఒక వికెట్ దక్కింది.