KL Rahul: ఇండియన్ క్రికెటర్, దిల్లీ క్యాపిటల్స్ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అతియా శెట్టి సోమవారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అందుకే లక్నోతో జరిగిన మొదటి మ్యాచ్‌కు కేఎల్‌రాహుల్ దూరమయ్యాడు. తనకు బిడ్డ పుట్టిందని రాహుల్, అతియా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు.
తల్లిదండ్రులు కాబోతున్నట్లు తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాహుల్, అతియా తెలియజేశారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో అతియా శెట్టి గర్భవతి అని ప్రకటించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి, ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు రాహుల్ హాజరు కాకపోవచ్చు అని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు తన భార్య, బిడ్డ ఆసుపత్రిలో ఉన్నందున రాహుల్ మరికొన్ని మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రాహుల్, అతియా జంటకు సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ శుభవార్తపై బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కియారా అద్వానీ, అర్జున్ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కెఎల్ రాహుల్ శిక్షణ శిబిరంలో చేరాడు. కానీ టాస్ సమయంలో రాహుల్ ఆడటంపై అక్షర్ పటేల్ ఏం చెప్పలేదు. లక్నోతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండటానికి రాహుల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నుంచి ప్రత్యేక అనుమతి లభించిందని తర్వాత ప్రకటించారు. కెఎల్ రాహుల్ ఆదివారం త్వరత జట్టులోకి రానున్నాడు. మార్చి 30న ఢిల్లీ శిబిరంలో చేరవచ్చని తెలుస్తోంది.