IPL 2024 SRH vs KKR Qualifier 1 SRH innings : కోల్‌కత్తా(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) బ్యాటర్లు తడబడ్డారు.  బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌.. తొలి ఓవర్‌ నుంచే ప్రారంభమైంది. ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న మిచెల్ స్టార్క్‌( Mitchell Starc)... హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. భువనేశ్వర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ బౌలింగ్‌ దళం ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా హైదరాబాద్‌కు ఎలిమినేటర్‌తో జరిగే మ్యాచ్‌లో  పోరాడే అవకాశం ఉంది.


ఆరంభం నుంచే
 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డుపై  ఒక్క పరుగు లేకుండానే ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ట్రానిస్‌ హెడ్‌ను మిచెల్‌ స్టార్క్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మంచి లెంత్‌లో పడ్డ బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్‌... క్లీన్‌  బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే అరోరా మరో వికెట్‌ నేలకూల్చి హైదరాబాద్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.  నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసిన అభిషేక్ శర్మను అరోరా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతికే షాబాజ్‌ అహ్మద్‌ అవుట్‌ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన మిచెల్‌ స్టార్క్‌ హైదరాబాద్‌ను  పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. స్టార్క్‌ విజృంభించడంతో హైదరాబాద్‌ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌ త్రిపాఠి హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. హెన్రిట్‌ క్లాసెన్‌తో కలిసి త్రిపాఠి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి హైదరాబాద్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చారు. కానీ కీలక సమయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ అవుట్‌ కావడంతో హైదరాబాద్‌ మళ్లీ కష్టాల్లో పడింది. క్లాసెన్‌ 21 బంతుల్లో 32 పరుగులు చేసి వరుణ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. క్లాసెన్‌ అవుట్‌ అవ్వడంతో మళ్లీ హైదరాబాద్‌ వికెట్ల పతనం ప్రారంభమైంది. సన్వీర్‌సింగ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ అయ్యాడు. సన్వీర్‌ సింగ్‌ను సునీల్‌ నరైన్‌ బౌల్డ్‌ చేశాడు. అబ్ద్లుల్ సమద్‌ కూడా 16 పరుగులు చేసి హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ పోరాడడంతో హైదరాబాద్‌ నిర్ణీత  19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. కమిన్స్‌ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు.   కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు,  వరుణ్‌ చక్రవర్తి రెండు, అరోరా, నరైన్‌,  హర్షిత్‌ రాణా, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ స్వల్ప స్కోరును హైదరాబాద్‌ బౌలర్లు కాపాడుకుంటారేమో చూడాలి.