KKR vs RR IPL 2024 Rajasthan Royals won by 2 wkts : జోస్ బట్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి  ఖాయమని అందరూ అనుకున్న వేళ వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్ కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్ లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్ లో నిలచిన బట్లర్  తన జట్టును గెలిపించాడు.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా... సునీల్‌ నరైన్‌ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌  జోస్ బట్లర్ అద్భుత శతకంతో చివరి బంతికి విజయాన్ని అందుకుంది. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్ లు, 6 సిక్సర్ లతో 107 పరుగులు చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. 


నరైన్‌ ఒంటిచేత్తో...
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే సాల్ట్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రియాన్‌ పరాగ్ జారవిడిచాడు. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ అవుటయ్యాడు. అవేశ్‌ సూపర్‌ రిట్నర్ క్యాచ్‌తో సాల్ట్‌ అవుటయ్యాడు. కేవలం పది పరుగులే చేసి సాల్ట్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రఘువంశీతో కలిసి నరైన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో రఘువంశీ మూడు బౌండరీలు బాదేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కత్తా ఒక వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. రఘువంశీ, నరైన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సిక్సర్‌తో సునీల్ నరైన్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ వేసిన పదో ఓవర్‌లో ఐదో బంతికి సునీల్ నరైన్ సిక్సర్‌ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్‌ విధ్వంసంతో 10 ఓవర్లకు స్కోరు కోల్‌కతా ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. రఘువంశీ 18 బంతుల్లో 30 పరుగులు చేసి అవుటయ్యాడు. కుల్దీప్‌ సేన్ వేసిన 10.4 ఓవర్‌కు అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి రఘువంశీ అవుటయ్యాడు. అశ్విన్ వేసిన 12 ఓవర్‌లో నరైన్‌ రెండో బంతికి సిక్స్‌, తర్వాతి బంతికి ఫోర్, లాస్ట్ బౌల్‌కు బౌండరీ సాధించాడు. ఓపక్క నరైన్‌ నిలబడ్డా మరోపక్క కోల్‌కతా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 11 పరుగులే చేసి అవుటయ్యాడు. చాహల్‌ వేసిన 13 ఓవర్‌లో ఐదో బంతికి సిక్స్‌ కొట్టిన అయ్యర్‌.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నరైన్‌ సెంచరీ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 16వ ఓవర్లో మొత్తం 23 పరుగులొచ్చాయి. నరైన్‌ ఈ ఓవర్లో 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. అవేశ్‌ఖాన్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికే రసెల్‌ ఔటయ్యాడు. సునీల్‌ నరైన్‌ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 109 పరుగులు చేసి బౌల్ట్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో రింకూ సింగ్‌ 20 పరుగులు చేయడంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 


లక్ష్య ఛేదనలో ఇలా..
 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలో ధాటిగా ఆడిన యశస్వీ జైస్వాల్‌ రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేసి జైస్వాల్‌ అవుటయ్యాడు. సంజు శాంసన్‌ కూడా 12 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపు మెరుపులు మెరిపించిన రియాన్‌ పరాగ్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 34 పరుగులు చేసి రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ధ్రువ్‌ జురెల్ రెండు పరుగులే చేసి నరైన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిది పరుగులు చేసి అవుటవ్వగా.. హెట్‌మెయిర్‌ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. అశ్విన్‌, హెట్‌మెయిర్‌ను ఒకే ఓవర్లో అవుట్‌ చేసి వరుణ్‌ చక్రవర్తి... కోల్‌కత్తాను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో 125 పరుగులకే కోల్‌కత్తా ఆరు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ ఓటమి ఖాయమనుకున్న వేళ జోస్‌ బట్లర్‌ వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్ కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్ లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్ లో నిలచిన బట్లర్ తన జట్టును గెలిపించాడు. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్ లు, 6 సిక్సర్ లతో 107 పరుగులు చేసి రాజస్థాన్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.