IPL 2024 KKR vs RR Rajasthan Royals opt to bowl: కోల్‌కత్తా (KKR)జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్(RR) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో లక్ష్య ఛేదన తేలికని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ నుంచి రాజస్థాన్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో నరైన్‌కు మంచి రికార్డు ఉంది. తన స్పిన్ మాయాజాలంతో నరైన్ ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరోసారి ఆలాంటి ప్రదర్శనే చేయాలని నరైన్ చూస్తుండగా... నరైన్‌ను ఎదుర్కొనేందుకు రాజస్థాన్ పక్కా ప్రణాళిక రచిస్తోంది. రాజస్థాన్‌పై విజయం సాధిస్తే కోల్‌కత్తా అగ్రస్థానానికి చేరుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచుల్లో నరైన్ ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సేనను కేవలం 161 పరుగులకు కట్టడి చేయడంలో నరైన్ కీలకపాత్ర పోషించాడు. సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్ ఈ సీజన్‌లో 155 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వీరు నరైన్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కోల్‌కత్తాను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేలవమైన ఫామ్ ఆందోళన పరుస్తోంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 38 పరుగులతో నాటౌట్‌గా ఉన్నా అప్పటికి అతడిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ ఎలా రాణిస్తాడో చూడాలి.
రాజస్థాన్ జోరు కొనసాగేనా..
సంజు శాంసన్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ సీజన్‌లో 183.51 స్ట్రైక్-రేట్‌తో 33 సగటుతో ఉన్న నరైన్ ధాటిగా ఆడుతున్నాడు. మిగిలిన బ్యాటర్లు కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, కేశవ్ మహారాజ్‌లలో బలీయమైన బౌలింగ్ లైనప్ ఉంది. రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌కి ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాలి.
హెడ్-టు-హెడ్ రికార్డులు:
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా-రాజస్థాన్ 28 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో కోల్‌కత్తా 14 విజయాలు నమోదు చేయగా.. రాజస్థాన్ 13 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. రాజస్థాన్‌పై అప్పటి కోల్‌కత్తా ప్లేయర్ దినేష్ కార్తీక్ అత్యధిక పరుగులు నమోదు చేశాడు. కార్తిక్ 8 మ్యాచుల్లో 68 బ్యాటింగ్ సగటుతో 150.28 స్ట్రైక్ రేట్‌తో 272 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. KKRలో ప్రస్తుత బ్యాటర్లలో నితీష్ రాణా 11 ఇన్నింగ్స్‌ల్లో 24.89 బ్యాటింగ్ సగటుతో 224 పరుగులు చేశాడు. రాజస్థాన్‌పై శివమ్ మావి కోల్‌కత్తా తరపున ఆడుతూ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో మావి 13 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కత్తా ప్రస్తుత బౌలర్లలో, స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ 18 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.
అత్యధిక పరుగులు
2022లో రాజస్థాన్‌పై కోల్‌కత్తా 210 పరుగులు నమోదు చేసింది. ఇదే రాజస్థాన్‌పై కోల్‌కత్తాకు అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓడిపోయింది. కోల్‌కత్తా తరఫున శ్రేయస్ అయ్యర్, ఆరోన్ ఫించ్ అర్ధ సెంచరీలు చేశారు. 2013లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో కోల్‌కత్తా కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. ఇదే అత్యల్ప స్కోరు.